సీలింగ్ భూములు స్వాహా!
శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడలో అక్రమాలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా /శంషాబాద్ రూరల్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న ఘాంసిమియాగూడ సర్వే నంబర్ 3, 4లో 400 ఎకరాల సీలింగ్ భూమి ఉంది. ప్రభుత్వం అప్పట్లో కొంత మంది నిరుపేద రైతులకు కొంత అసైన్డ్ చేసింది. ఆయా భూములు సీలింగ్ పట్టాలుగా రికార్డు అయ్యాయి. నిబంధనల ప్రకారం వీటిని అమ్మడం, కొనడం నేరం. రిజిస్ట్రేషన్ చేయొద్దని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ 2025 ఫిబ్రవరి 18న జిల్లా రిజిస్ట్రార్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రే షన్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో 15 ఎకరాల స్థలంలో ఓ కీలక నేత నిర్మాణాలు చేపట్టడాన్ని పరిశీలిస్తే.. అధికార యంత్రాంగం ఎలా దాసోహం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. సుమారు 20 ఎకరాలకు సంబంధించి గత ప్రభుత్వంలోని సీఎంకు లెఫ్ట్..రైట్ అనుకున్న ఓ పెద్దమనిషి ఆ భూములను రైతుల నుంచి కొనుగోలు చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. దీనిపై అప్పట్లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో రేవంత్‌రెడ్డే స్వయంగా నాగలికట్టి నిరసన తెలిపారు. సదరు భూములు పేదలకు చెందాల్సినవని, క్రయవిక్రయాలకు వీలు లేదు, కొనుగోలు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే సర్వే నంబర్‌లో గోల్డ్‌స్టోన్ కంపెనీ భారీగా భూములు కొనుగోలు చేసింది. దీనిపై నాటి ప్రభుత్వం కోర్టులో కేసు కూడా వే సింది. గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌ను మాత్రమే కాదు ఎన్నో ఏళ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటున్న రైతులను కూడా భూముల్లోకి రాకుండా అడ్డుకుంది. అదే సర్వే నంబర్‌లోని కొంత భూమిని స్థానికంగా ఉన్న ఓ ప్రజాప్ర తినిధి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అందులో భారీ నిర్మాణాలు చేపడుతుండటం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ భూమి నుంచి గోదాం వరకు ఏకంగా మట్టి రోడ్డు వేసుకున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
వారసుల పేరుతో పాగా
వివాదాస్పద ఈ భూములు పైగా వారసులకు చెందినవంటూ కొంతమంది కోర్టు నుంచి తమకు అనుకూలంగా ఆర్డర్లు తెచ్చుకుని పాగా వేశారు. ఏళ్ల నుంచి భూములను సాగు చేసుకుంటున్న రైతులను బెదిరించి, ఎంతో కొంత వారికి ముట్టజెప్పి వారిని బలవంతంగా కబ్జా నుంచి పంపించి వేశారు. ఇదే సమయంలో ఈ భూముల్లో కొంత సీలింగ్ పట్టాలు కలిగిన రైతులు ఉన్నారు. మరికొంత మంది పట్టాదారులు ఉన్నారు. పైగా భూములపై తమకు హక్కులు ఉన్నాయంటూ గోల్డ్ స్టోన్ కంపెనీ అప్పట్లోనే ఇక్కడ కొంత భాగం తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి వరకు సాగు చేసుకుంటున్న రైతులకు ఎకరాకు రూ.5 లక్షలు చెల్లించి.. వారి వద్ద ఉన్న అన్ని రికార్డులు స్వాధీనం చేసుకుంది. ఇదే కంపెనీ నుంచి స్థానికంగా ఉన్న ఓ ప్రజాప్రతినిధి 15 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అప్పటి వరకు నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఆ తర్వాత పట్టా భూములుగా మారిపోయాయి. ఇదిలా ఉండగా ఈ భూములను రెవెన్యూ అధికారులు ఇటీవల రీసర్వే చేశారు. రైతుల వద్ద ఉన్న రికార్డులు, సాగు విస్తీర్ణం మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు.
ఘాన్సీమియాగూడలోని వివాదాస్పద భూముల విషయంలో కోర్టు నుంచి పలు ఉత్తర్వులు ఉన్నాయి. 2011లోనే సీలింగ్ ఎత్తివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. తర్వాత 2023లోనూ ప్రభుత్వం మెమో జారీ చేసింది. అప్పటి వరకు ఉన్న సీలింగ్‌ను తొలగించి, దాని స్థానంలో పట్టా భూమిగా నమోదు చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు సీలింగ్ భూములను పట్టా భూములుగా మార్చాల్సి వచ్చింది. గోదాములు, ఇతర నిర్మాణాలు ఉన్న ప్రదేశానికి 111 జీఓలో మినహాయింపు కల్పించింది.
– రవీందర్ దత్తు, తహసీల్దార్, శంషాబాద్
పట్టా భూములుగా.. నిషేధిత జాబితాలోని భూములు
111 జీఓ నిబంధనలకు తూట్లు.. భారీ షెడ్లతో నిర్మాణాలు
పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం


