కాలుష్యం ఆగాలి
అప్రమత్తంగా ఉండాలి..
● నగరంలో క్షీణిస్తున్న వాయు నాణ్యత
● ప్రమాదకర స్థాయిలో సూచీలు
● 250కి చేరువలో పీఎం– 2.5
● పట్టించుకోని పీసీబీ అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వాయు కాలుష్యం గరిష్ట సూచీలను తాకుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గాలిలో ధూళి కణాల సాంద్రత భారీగా వృద్ధి చెందుతోంది. ఒకవైపు తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, మరో వైపు గాలి కాలుష్యం నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పీఎం 2.5 (పర్టిక్యులేట్ మ్యాటర్) 242ను సూచిస్తోంది. పీఎం– 10 గణాంకాలు 150 దగ్గరల్లో కదలాడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే శ్వాసకోశ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శీతాకాలం మంచు, చల్లని గాలిలో ధూళి కణాలు 4 నుంచి 8 అడుగుల ఎత్తులో అధిక మోతాదులో ఉంటాయి. దీంతో మనిషి శ్వాసనాళంలోకి సులువుగా చేరుతుంది. ఫలితంగా శ్వాసకోశ రోగాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందంని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
భారీ వ్యత్యాసం..
నగరంలో మొత్తం 14 ప్రాంతాల్లో గాలి నాణ్యతను కొలిచే యంత్రాలను కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. అందులో 8 ప్రాంతాల్లో గాలి కాలుష్య తీవ్రతకు అద్దం పట్టే గణాంకాలు నమోదవుతున్నాయి. వాయు నాణ్యత సూచీ 50 కంటే తక్కువగా ఉంటే స్వచ్ఛమైన గాలి అందుతుందని లెక్క, ఏక్యూఐ 100 వరకు మోడరేట్. అదే గాలి నాణ్యత సూచీ 100 దాటితే మాత్రం ప్రమాదం పొంచిఉన్నట్లే అని పీసీబీ చెబుతోంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఒకవైపు నుంచి మంచు, చలిగాలులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇదే సమయంలో కాలుష్యం పెరుగుతుండటం ప్రజల ఆరోగ్యంపై ఆందోళన మొదలవుతోంది. ఇదిలా ఉండగా.. పీసీబీ నివేదికలకు కొన్ని ప్రైవేటు సంస్థల వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) నివేదికలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.
అనేక రకాలుగా..
నగరంలో వాయు కాలుష్యం నిత్యం పెరుగుతూ వస్తోంది. పరిశ్రమల నుంచి వెలువడే గాఢ వాయువులతో పాటు, రహదారులపై దుమ్మూ ధూళి కణాలు, వాహనాల నుంచి వెలువడే పొగ గాలిలో నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. మరోవైపు నిర్మాణ రంగం జోరుగా ఉన్న ప్రాంతాల్లో ధూళి కణాల సంఖ్య మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఆయా ప్రాంతాల్లో గాలి నాణ్యతను కొలిచే పరికరాలు లేక దాని తీవ్రత ప్రజలకు అర్థం కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. గాలి కాలుష్యాన్ని నియంత్రించడంలో పీసీబీ అధికారులు దృష్టి సారించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రాంతం పీఎం– 2.5 పీఎం– 10
మలక్‌పేట్ 242 122
కంది 223 –
పటాన్‌చెరు 189 158
పాశమైలారం 184 137
జూపార్కు 185 154
సోమాజిగూడ 183 –
సనత్‌నగర్ 183 –
కోకాపేట్ – 116
కోల్డ్ వేవ్‌తో ఆస్తమా, సీఓపీడీ, దీర్ఘకాలికంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఇటువంటి సమయంలో గాలి కాలుష్యం అంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చల్లని గాలిలో ధూళి కణాల కదలికల్లో చురుకుదనం ఉండదు. సగటు మనిషి ఎత్తులోనే ధూళి కణాలు ఉండటంతో సులువుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. న్యుమోనియా, ఆస్తమా బాధితులు, చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
– డా.ఎం.రాజీవ్, పల్మనాలజిస్ట్


