26/11 | - | Sakshi
Sakshi News home page

26/11

Apr 11 2025 8:52 AM | Updated on Apr 11 2025 8:52 AM

26/11

26/11

సిటీ @
నగరంలోనూ ముంబై ఉగ్రదాడుల చేదు గుర్తులు

దాడుల్లో కన్నుమూసిన ఇద్దరు హైదరాబాదీలు

ఇక్కడి అడ్రస్‌లతో ఉగ్రవాదుల గుర్తింపు కార్డులు

ఎట్టకేలకు అమెరికా నుంచి తెహవూర్‌ రాణా తరలింపు

సాక్షి, సిటీబ్యూరో: 26/11 ముంబై మారణహోమం కేసులో కీలక నిందితుడిగా ఉన్న తెహవూర్‌ రాణాను ఎట్టకేలకు ఢిల్లీకి తీసుకువచ్చారు. గురువారం అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఇండియాకు ఇతడిని తీసుకువచ్చినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ముంబై మహా నగరంలో 2008 నవంబర్‌ 26న అజ్మల్‌ కసబ్‌ సహా పది మంది సృష్టించిన మారణ కాండకు సంబంధించి భాగ్య నగరంలోనూ కొన్ని చేదు గుర్తులున్నాయి. నాటి దాడుల్లో ఇద్దరు హైదరాబాదీలు మరణించగా.. నగరంలోని కొన్ని ప్రాంతాల చిరునామాలతో ఉగ్రవాదుల దగ్గర నకిలీ గుర్తింపు కార్డులు లభించాయి. దీంతో కొందరు నగరవాసులు ఆ కేసుల్లో సాక్షులుగా వాంగ్మూలం ఇచ్చారు.

అసువులు బాసిన ఇరువురు..

మారణహోమం సృష్టించడానికి పాకిస్థాన్‌ నుంచి సముద్ర మార్గంలో వచ్చిన ఉగ్రవాదులు ‘బుడ్‌వార్‌ పార్క్‌ జెట్టీ’ నుంచి ఓ ట్యాక్సీలో ‘వీటీ’ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ దిగుతూ.. అందులో బాంబు అమర్చారు. పాతబస్తీకి చెందిన కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎకై ్సజ్‌ కన్సల్టెంట్‌ అడ్వొకేట్‌ లక్ష్మీనారాయణ గోయల్‌ ఓ కేసు పని నిమిత్తం ముంబై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భాగంగా అదే రోజు కాందవెల్లీ ప్రాంతం నుంచి ‘వీటీ’ రైల్వే స్టేషన్‌కు ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో ఆయన ఎక్కాల్సిన హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ను మిస్సయ్యారు. వీటీ స్టేషన్‌ నుంచి తిరిగి కాందవెల్లీలోని తన మరదలు ఉష ఇంటికి వెళ్లడానికి ఉగ్రవాదులు దిగిన ట్యాక్సీనే ఎక్కారు. ఈ ట్యాక్సీ ‘విల్లే పార్లీ’ సమీపంలోకి చేరుకోగానే అందులోని బాంబు పేలడంతో ఆయన కన్నుమూశారు. నగరంలోని నేరేడ్‌మెట్‌ పరిధిలోని డిఫెన్స్‌ కాలనీకి చెందిన విజయరావు బాంజే అక్కడి తాజ్‌ హోటల్‌లో చీఫ్‌ చెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. ముష్కరులు టార్గెట్‌ చేసిన వాటిలో ఈ హోటల్‌ కూడా ఒకటి. అతిథులను రక్షించే ప్రయత్నంలో ఉగ్రవాదుల తూటాలకు బాంజే బలయ్యారు.

బోగస్‌ గుర్తింపు కార్డుల్లోనూ...

26/11 దాడుల్లో పాల్గొన్న పది మంది ఉగ్రవాదుల్లో తొమ్మిది మంది దగ్గర బోగస్‌ పేర్లతో గుర్తింపు కార్డులు లభించాయి. వీటిలో కొన్నింటిపై హైదరాబాద్‌లోని వివిధ చిరునామాలు ముద్రించి ఉన్నాయి. ఈ మారణహోమంలో సజీవంగా దొరికిన ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ (2012లో ఉరి తీశారు) దగ్గర లభించిన బోగస్‌ గుర్తింపు కార్డులో నాగోలు ప్రాంతానికి చెందిన చిరునామా ఉంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని అరుణోదయ డిగ్రీ కళాశాలలో చదువుతున్నట్లుగా చక్రబర్తి పేరుతో ఉన్న ఆ గుర్తింపు కార్డులో నాగోలులోని మమతానగర్‌ కాలనీ, ఇస్మాయిల్‌ ఖాన్‌కు నరేష్‌ విలాస్‌ వర్మ పేరుతో నాగోలు, నిస్సార్‌కు దినేష్‌కుమార్‌ పేరుతో సరూర్‌నగర్‌లోని హుడా కాలనీ, ఫహదుల్లాకు రోహిత్‌ దీపక్‌ పాటిల్‌ పేరుతో విజయ్‌నగర్‌ కాలనీలోని ఎస్‌కే అపార్ట్‌మెంట్స్‌ చిరునామాలతో నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేశారు. ఈ నేపథ్యంలోనే ముంబై దాడుల కేసులు దర్యాప్తు చేసిన అక్కడి క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు హైదరాబాద్‌ సైతం వచ్చి నాగోలు, అరుణోదయ డిగ్రీ కళాశాలలో విచారణ చేశారు. 26/11 ఉదంతాలపై నమోదైన కేసుల్లో అరుణోదయ కాలేజీ ప్రిన్సిపల్‌గా పని చేసిన రాధాకృష్ణయ్య, గోయల్‌, బాంజే కుటుంబాలు సైతం కీలక సాక్షిగా ఉండి న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చాయి.

అప్పట్లో 48 గంటల ఉత్కంఠ..

దాడులు జరుగుతున్న రోజే ఆ ఉగ్రవాదుల్లో షాదుల్లాహ్‌, ఇమ్రాన్‌ బాబర్‌ ఓ న్యూస్‌ ఛానల్‌ ఫోన్‌ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తమది హైదరాబాద్‌ అంటూ చెప్పడంతో తీవ్ర కలకలం రేగింది. వాళ్లు ఎవరు? నగరంలో ఎక్కడి వాళ్లు? అనే ఉత్కంఠ 48 గంటలు నెలకొంది. చివరకు లింగ్విస్టిక్‌ ఎక్స్‌పర్ట్స్‌ (భాషా నిపుణుల) వల్ల దీనికి తెరపడింది. ఈ నిపుణులు ఉగ్రవాదుల ఇంటర్వ్యూ రికార్డులు విశ్లేషించారు. వీరి మాటల్లో ‘జిహాద్‌’ (పవిత్ర యుద్ధం), ‘జుల్మ్‌’ (అట్రాసిటీ) పదాలే ఎక్కువగా ఉన్నాయి. వీరు వాడిన మాండలికం ఆధారంగా పాకిస్థాన్‌లోని పంజాబ్‌, పెషావర్‌లకు చెందిన వారుగా భాషా నిపుణులు నిర్ధారించారు. టెర్రరిస్టులు వాడిన ‘ఖత్లే ఆమ్‌’ (సామూహిక మారణకాండ) పదాన్ని అక్కడి వారే ఉచ్చరిస్తారని తేల్చారు. ఇలా మరికొన్ని పదాలను విశ్లేషించిన నిపుణులు ఉగ్రవాదులకు హైదరాబాద్‌తో సంబంధం లేదని తేల్చారు. దీంతో పోలీసు, నిఘా వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.

ముంబై పేలుళ్ల దృశ్యం (ఫైల్‌)

26/111
1/3

26/11

26/112
2/3

26/11

26/113
3/3

26/11

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement