
మామిడి రైతుల ప్రయోజనాలే ముఖ్యం
గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్: పండ్ల మార్కెట్‌కు వచ్చే మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ వారి ప్రయోజనాల కోసమే మార్కెట్ కమిటీ పనిచేస్తోందని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి అన్నారు. మామిడి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో గురువారం ఆయన బాటసింగారం పండ్ల మార్కెట్‌లో జరుగుతున్న మామిడి పండ్ల క్రయవిక్రయాలను పాలకవర్గ సభ్యులు, అధికారులతో కలిసి పరిశీలించారు. మామిడి మార్కెట్ యార్డులో కలియ తిరిగి రైతుల సమస్యలు, క్రయవిక్రయాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌కి వచ్చిన రైతుల సమస్యలు తెలుసుకొని వారి సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది కంటే ఈ సంవత్సరం మామిడి దిగుబడి అధికంగా ఉందని, మార్కెట్‌కి వచ్చే రైతులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రైతులకు గిట్టుబాటు అందించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. రోజుకు 800 వాహనాలు మార్కెట్‌కి వస్తున్న తరుణంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరాచారి, మార్కెట్ సెక్రటరీ ఎల్.శ్రీనివాస్, డైరెక్టర్లు బండి మధుసూదన్ రావు, అంజయ్య, నవరాజ్, రఘుపతి రెడ్డి, నరసింహ, జైపాల్ రెడ్డి, మచ్చేందర్ రెడ్డి, గణేశ్‌నాయక్, వెంకటేశం గుప్తా, ఇబ్రహీం పాల్గొన్నారు.