సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న ఈ తరహా ప్రార్థన స్థలాలు అడుగడుగునా ట్రాఫిక్ అడ్డంకులను సృష్టిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగినా... ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించలేదు. నగరంలో ఈ తరహా ప్రార్థన స్థలాలు 253 ఉన్నాయి. వీటికి తోడు మరికొన్ని ప్రాంతాల్లో శ్మశాన వాటికలూ అడ్డంకులుగా మారాయి.
అత్యధికంగా ఫలక్‌నుమాలో..
నగరంలో ఉన్న 253 ‘అక్రమ’ ప్రార్థన స్థలాల్లో అత్యధికంగా ఫలక్‌నుమాలోనే ఉన్నాయి. ఇక్కడ గరిష్టంగా 43 ఉండటం గమనార్హం. ఇవి అనేక రకాలుగా ట్రాఫిక్ ఇబ్బందులను కలిగిస్తున్నాయి. అతి తక్కువగా ఉన్నది చార్మినార్ పోలీసుస్టేషన్ పరిధిలో. ఇక్కడ కేవలం ఒకే ప్రార్థన మందిరం ఇబ్బందికరంగా ఉంది. ఒకప్పుడు ఫలక్‌నుమా నగరానికి దూరంగా ఉండటం, ఇప్పుడది అంతర్భాగం కావడంతో అక్కడ ఈ పరిస్థితులు ఉన్నాయన్నది అధికారుల మాట.
తొలగింపు ప్రహసనమే..
అనేక సందర్భాల్లో ట్రాఫిక్ నరకానికి కారణమవుతున్న ఈ అనధికారిక ప్రార్థన మందిరాల తొలగింపు పెద్ద ప్రహసనంగా మారిపోయింది. నగరంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇది అత్యంత సున్నితమైన అంశంగా పరిగణించాల్సింది. 2009లో కోఠిలోని ఉమెన్స్ కాలేజీ బస్టాప్ వద్ద ఉన్న ఓ ప్రార్థన స్థలాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు ‘తాకడం’తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు ఆరు గంటల పాటు ఆ ప్రాంతం రణరంగంగా మారిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లోని వాటి జోలికి వెళ్లినప్పుడూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఫలితంగా వీటి విషయంపై మాట్లాడటానికే సంబంధిత అధికారులు పలుమార్లు ఆలోచించాల్సి వస్తోంది.
అంతా కలిసి ముందువెళితేనే...
ఏళ్లుగా వేధిస్తున్న ఈ సమస్యను పరిష్కరించి, అరుణాచల్‌ప్రదేశ్ తరహాలో భాగ్యనగరాన్నీ నాగరిక నగరం అంటూ అత్యున్నత న్యాయస్థానం కితాబు పొందాలంటే అన్ని వర్గాలు, శాఖల అధికారులు కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నగరంలోని మూసారాంబాగ్, ఐఎస్ సదన్ తదిరత ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాలు ఒకే చోట ఉన్నాయి. వీటి విషయం వచ్చేసరికి తరచూ ఎదురవుతున్న మాట ‘ముందు వారిది తొలగించండి’. ఈ కారణంతోనే ఏళ్లుగా సమస్యలు అలాగే నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. సాధారణ సమయాల్లో కంటే సంబంధిత పర్వదినాలప్పుడు ఈ ఇబ్బందులు మరింత ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వ శాఖలు సైతం వీటి విషయంలో ఎవరికి వారే అన్నట్లు ముందుకుపోకుండా అన్నీ కలిసి సమష్టి నిర్ణయం, ప్రణాళికతో వ్యవహరించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
‘గ్రీన్ మాస్క్’ వద్ద విజయవంతం..
బంజారాహిల్స్ రోడ్ నెం.3లో ఉన్న గ్రీన్ మాస్క్ ప్రహరీ గోడ విషయంలో పోలీసులు, దాని నిర్వాహకులు, మత పెద్దలు తీసుకున్న చర్యలు ఆదర్శప్రాయమని అధికారులు చెబుతున్నారు. ఏళ్లుగా ఈ ప్రార్థన మందిరం ఇక్కడే ఉన్నప్పటికీ.. ఈ మార్గం రద్దీగా మారడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. భారీ ట్రాఫిక్ జాంలతో పాటు ఎన్‌ఎఫ్‌సీ చౌరస్తా, జీవీకే మాల్ వరకు వాహనాలు ఆగిపోయేవి. దీంతో చొరవ తీసుకున్న ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ అధికారులు మత పెద్దలతో చర్చించారు. ఫలితంగా రహదారిపైకి ఉన్న ప్రహరీ గోడలో కొంత భాగం తొలగించడంతో వాహన చోదకులకు భారీ ఊరట లభించింది. ఇదే విధానాన్ని మిగిలిన ప్రార్థన స్థలాల విషయంలో అవలంబించాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ చిక్కులకు మోక్షం కలిగించాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.