న్యూస్‌రీల్
గురువారం శ్రీ 12 శ్రీ నవంబర్ శ్రీ 2026
‘గ్రేటర్’లో ఆందోళనకరంగా ఆహార కల్తీ ఘటనలు
సాక్షిప్రతినిధి, వరంగల్:
గ్రేటర్ వరంగల్ నగరంలో హోటళ్లు, బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీ, స్వీట్ షాపుల్లో ఆహార భద్రత గాలికి వదిలేస్తున్నారు. రుచికి, రంగుకు ప్రాధాన్యమిస్తూ పరిశుభ్రతను విస్మరిస్తున్నారు. కుళ్లిన ముడిసరుకులు, గడువు తీరిన పదార్థాలు, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార తయారీ సాగుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడిన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఆహార భద్రత నిబంధనలే అమలుకు నోచుకోకపోవడం నగరవాసులను కలవరపెడుతోంది.
యథేచ్ఛగా వ్యాపారం!
గ్రేటర్ వరంగల్‌లో హోటళ్లు, బిర్యానీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్వీట్ షాపుల సంఖ్య భారీగా ఉంది. 380–420 రెస్టారెంట్లు, హోటళ్లు, 100–120 స్వీట్‌హౌజ్‌లు, 130 వరకు బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు 500–550లు, బిర్యానీ పాయింట్లు 180–200 వరకు ఉంటాయనేది అధికార వర్గాల లెక్క. రోజువారీ ఆహార విక్రయాల స్థూల అంచనా రూ.1.10 కోట్ల నుంచి రూ.1.60 కోట్ల మేరకు ఉంటుంది. కొందరు రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నాణ్యత, శుచి, శుభ్రతను పాటిస్తున్నప్పటికీ మరికొందరు ఏ మాత్రం నిబంధనలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి వాటిపై నిరంతర తనిఖీలు జరగాల్సి ఉన్నా.. అప్పుడప్పుడు జరిగే దాడులతోనే సరిపెడుతున్నారనే విమర్శలున్నాయి. నమూనాల సేకరణతోపాటు వాటి పరీక్ష ఫలితాలను త్వరగా వెల్లడించడం, ఉల్లంఘనలకు పాల్పడిన సంస్థలపై చర్యలను పర్యవేక్షించడం కీలకంగా మారింది.
తనిఖీలతోనే ప్రజారోగ్యానికి భరోసా..
హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు పెంచాలి. మాంసం, నూనెలు, మసాలాలు, రంగుల నాణ్యతను పరీక్షించాలి. గత నెల 29న మెరుపుదాడులు నిర్వహించిన టీజీ సేఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సుమారు 50 వరకు రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు, నూనెమిల్లులు, ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. తొమ్మిది మందికి నోటీసులు ఇచ్చి లైసెన్స్‌లు రద్దు చేశారు. అపరిశుభ్రత ఉన్న కేంద్రాలకు నోటీసులతో సరిపెట్ట కుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, లైసెన్సులు సస్పెండ్ చేసిన సంస్థలపై ఫాలోఅప్ తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
కల్తీ ఆహారంతో అనారోగ్యం
కల్తీ ఆహారం ఆహారం తీసుకున్న వెంటనే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. ఆహారంలో కలిపే కొన్ని హానికరమైన రసాయనాలు, కృత్రిమ రంగులు, విషపూరిత లోహాలు శరీరంలోకి చేరితే కాలేయం, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కొన్ని విషపదార్థాలతో క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులపై వీటి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
– సిరుప రఘు, జనరల్ ఫిజీషియన్, హనుమకొండ
తనిఖీలు చేపట్టాలి
హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్‌పుడ్ సెంటర్లలో ఏం తింటున్నామో.. ఎలాంటి ఆహారం పెడుతున్నారో తెలియని పరిస్థితి. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యత లేని కుళ్లిన చికెన్ పీస్‌లతో కూడిన బిర్యానీ అమ్ముతున్నారు.. వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటోంది.. ఆతర్వాత దుర్వాసన వస్తోంది. అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహించాలి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, బిర్యానీ సెంటర్లు, బేకరీ దుకాణాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– గోనే రాంప్రసాద్, కరీమాబాద్, వరంగల్
●
బిర్యానీ సెంటర్లు, హోటళ్లు,
స్వీట్ షాపుల్లో నిబంధనలకు నీళ్లు
ఉడికీఉడకని చికెన్,
కృత్రిమ రంగుల వాడకం
బూజుపట్టిన అల్లం.. గడువు తీరిన పాలు.. తుప్పుపట్టిన యంత్రాలు
టీజీ సేఫ్ తనిఖీల్లో వెల్లడి..
తరచూ తనిఖీలు చేస్తేనే కట్టడి


