హన్మకొండ అర్బన్ : రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రూ.20 వేల కోట్ల సాయం అందించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల పక్షపాత వైఖరి విడనాడాలన్నారు. కరువు నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా చౌక ధరల దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా లేదా రాయితీకింద సరఫరా చేయాలన్నారు. నీరు లేక ఎండిపోయిన వరికి ఎకరానికి రూ.30 వేలు, పత్తి, మొక్కజొన్న పంటలకు ఎకరానికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను గుర్తించి ప్రభుత్వ సహాయం అందించాలన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు ఎన్. అశోక్ స్టాలిన్, ఉట్కూరి రాములు, కర్ర లక్ష్మణ్, నేదునూరి రాజమౌళి, బాషబోయిన సంతోష్, కొట్టెపాక రవి, జక్కు రాజు గౌడ్, వేల్పుల సారంగపాణి, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా


