సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలి

Nov 12 2026 5:24 AM | Updated on Nov 12 2026 5:24 AM

సమస్యలు పరిష్కరించాలి లండన్‌ పార్లమెంట్‌లో వరంగల్‌ యువకుడికి అవకాశం నెలాఖరులోగా తొలి విడత రీ సర్వే పూర్తి చేయాలి కేయూ 24వ స్నాతకోత్సవ కమిటీలు..

హన్మకొండ : విద్యుత్‌ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్‌, జనరల్‌ సెక్రటరీ మక్క దానయ్య కోరారు. బుధవారం హనుమకొండకు వచ్చిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను అసోసియేషన్‌ నాయకులు కలిశారు. విద్యుత్‌ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన మెరిట్‌ కమ్‌ సీనియారిటీ విధానంలో తలెత్తుతున్న సమస్యలు వివరించి వినతి పత్రం అందజేశారు. సమస్యను విన్న ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని దానయ్య తెలిపారు.

కాశిబుగ్గ : వరంగల్‌లోని దేశాయిపేటకు చెందిన అరవింద్‌ నాగనబోయినకు లండన్‌ పార్లమెంట్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. బ్రిటన్‌ పార్లమెంట్‌ వెస్ట్‌ మినిస్టర్‌లో జరిగిన ఫారిన్‌ పాలసీ సెంటర్‌కు హాజరై ప్రత్యేక గుర్తింపు పొందారు.అంతర్జాతీయ సంబంధాలు, విదేశాంగ విధానం, ప్రపంచ రాజకీయ పరిణామాలపై జరిగిన చర్చలో వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరంపై అరవింద్‌ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. లండన్‌లో మాస్టర్స్‌ చదివేందుకు వెళ్లిన అరవింద్‌కు మన దేశానికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాలని విన్నవించే అవకాశం రావడం సంతోషంగా ఉందని వరంగల్‌కు చెందిన మిత్రులు తెలిపారు.

వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హన్మకొండ అర్బన్‌/న్యూశాయంపేట : భూముల రీసర్వే ప్రక్రియను ప్రజలకు మేలు జరిగేలా నిర్వహించాలని, ఈ నెలాఖరులోగా తొలి విడత రీ సర్వే పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.. అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. రీసర్వే ప్రక్రియలో ఎలా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేశారు. వీసీ అనంతరం హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వరంగల్‌ కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ సత్యశారద, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) ఎల్‌.కిశోర్‌కుమార్‌, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు.

నియామకం

హన్మకొండ : వరల్డ్‌ అలయన్స్‌ ఆఫ్‌ స్కూల్‌ ప్రిన్సిపల్స్‌ (డబ్ల్యూఏఎస్‌పీ) తెలంగాణ రీజినల్‌ డైరెక్టర్‌గా వెనిశెట్టి రవికుమార్‌ నియమితులయ్యారు. హనుమకొండ పలివేల్పుల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న రవికుమార్‌ను నియమిస్తూ వరల్డ్‌ అలయన్స్‌ ఆఫ్‌ స్కూల్‌ ప్రిన్సిపల్స్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ దీపశిఖ పాఠక్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ 24వ స్నాతకోత్సవాన్ని ఈనెల 28న క్యాంపస్‌లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో స్నాతకోత్సవ నిర్వహణకు వివిధ కమిటీలను నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వి.రామచంద్రం బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌గా ప్రొఫెసర్‌ పి.మల్లారెడ్డి, సభ్యులుగా ప్రొఫెసర్లు టి.మనోహర్‌, పి.వరలక్ష్మి, వై.వెంకయ్య ఉన్నారు. కన్వీనర్‌గా పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ కె.రాజేందర్‌ వ్యవహరించనున్నారు. వీరితో పాటు వివిధ కమిటీలు ఏర్పాటు చేసి కన్వీనర్లను, కో కన్వీనర్లును నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement