సీఐడీ చేతికి సీఎంఆర్‌ స్కాం! | - | Sakshi
Sakshi News home page

సీఐడీ చేతికి సీఎంఆర్‌ స్కాం!

Oct 27 2026 1:08 AM | Updated on Oct 27 2026 1:08 AM

సీఐడీ చేతికి సీఎంఆర్‌ స్కాం!

ఏళ్లుగా సీఎంఆర్‌ ఛీటింగ్‌..

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) వ్యవహారంలో అక్రమాలపై సీఐడీ పంజా విసరడంతో రైస్‌ మిల్లర్లలో గుబులు మొదలైంది. ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించడం.. కేటాయించిన ధాన్యం రకానికి అనుగుణంగా బియ్యం ఇవ్వకుండా మరో రకం బియ్యాన్ని సరఫరా చేయడం.. నాణ్యతలో తేడాలు చూపడం.. సీఎంఆర్‌ బకాయిలను చెల్లించకుండా కాలయాపన చేయడం వంటి ఆరోపణలు గతంలోనూ పలువురు మిల్లర్లపై వచ్చాయి. విజిలెన్స్‌, పౌరసరఫరాల శాఖల తనిఖీలు, కేసులు, కఠిన చర్యలు ఉన్నప్పటికీ అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడలేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన క్రైం ఇన్వెస్టిగేషన్‌ డిపార్టుమెంట్‌ (సీఐడీ) అధికారులు ఏకంగా అరెస్టులకు శ్రీకారం చుట్టడం కలకలం రేపుతోంది. ములుగు జిల్లాలో రైస్‌మిల్లర్ల సంఘం మాజీ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌తోపాటు రైస్‌మిల్లుల యజమానులు ఎలగందుల మోహన్‌, కొమురవెల్లి హరినాథ్‌, అక్కల రఘోత్తం, లాంకె పోతురాజులను సీఐడీ అరెస్టు చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా సీఎంఆర్‌ ఎగవేతదారులు, స్కాంలకు పాల్పడిన మిల్లర్లలో గుబులు మొదలైంది.

సన్న ధాన్యం.. దొడ్డు బియ్యం!

సీఎంఆర్‌ కింద ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని నిర్దేశిత ప్రమాణాల మేరకు మిల్లింగ్‌ చేసి బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. సన్నరకం ధాన్యాన్ని కేటాయించుకుని.. ఆ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయించి.. తక్కువ ధరకు లభించే దొడ్డురకం బియ్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వానికి అప్పగించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు జరిపిన విజిలెన్స్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా.. చర్యలకు సీఐడీని రంగంలోకి దింపింది. ములుగు జిల్లానుంచి యాక్షన్‌కు శ్రీకారం చుట్టిన సీఐడీ.. ఉమ్మడి వరంగల్‌లోనూ స్కాంకు పాల్పడిన మిల్లర్లపై దాడులు, అరెస్టులకు సమాయత్తమవుతోంది. హనుమకొండ జిల్లాలోనూ సుమారుగా 12మంది రైస్‌మిల్లర్లు సన్నరకం స్థానంలో దొడ్డుబియ్యం పెట్టారన్న ఆరోపణల మేరకు సీఐడీ ఆరా తీస్తోంది. ఇందులో కొందరు పౌరసరఫరాలశాఖ, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అఽధికారుల ప్రమేయం ఉందన్న కోణంలో కూడా విచారణ చేస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందో?నన్న ఆందోళన ఆ వర్గాల్లో కనిపిస్తోంది.

మరాడించకుండానే మాయం..

ఉమ్మడి జిల్లాలో 2022–23 సీఎంఆర్‌ డిఫాల్టర్లు 216 మిల్లర్లను గుర్తించి రూ.250.92 కోట్ల విలువైన 1,11,634 మె.టన్నుల ధాన్యం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికీ రూ.84.61 కోట్ల విలువైన 37,825 మె.టన్నులు రికవరీ చేసినట్లు అధికారులు రికార్డులు చెబుతున్నాయి. సుమారు 96 రైసుమిల్లుల నుంచి 73,809 మె.టన్నుల ధాన్యం సర్కారు చేరాల్సి ఉంది. మూడేళ్ల కిందట సుమారు రూ.131 కోట్ల విలువైన ధాన్యాన్ని 81 మిల్లుల నుంచి రాబట్టాలని.. ఆ మిల్లుల్లో రికార్డుల ప్రకారం ఉన్న ధాన్యానికి టెండర్‌ వేశారు. టెండర్‌ పొందిన ఏజెన్సీలు వెళ్లిచూస్తే ఆ మిల్లుల్లో మరాడించకుండానే మాయం చేసినట్లు తేలింది. అందులో సగం కూడ రాబట్టని అధికారులు.. ఆ మిల్లులకు చెందిన కొందరికీ బినామీ పేర్లపై పదే పదే ఇప్పటికీ సీఎంఆర్‌ కింద ధాన్యం కేటాయిస్తుండటం కొసమెరుపు. కాగా సన్నరకం స్థానంలో దొడ్డు బియ్యం పెట్టిన స్కాంతో పాటు సీఎంఆర్‌ ఎగవేతదారులపైన సీఐడీ దృష్టి సారించనుండటం ఇటు ఎగవేతదారులు, అటు వారికి సహకరించిన అధికారుల్లో ఆందోళన మొదలైంది.

సన్నరకం కేటాయించుకుని.. దొడ్డు బియ్యం అప్పగింత

ఛీటింగ్‌ బ్యాచ్‌పై సీఐడీ పంజా..

రైస్‌మిల్లర్లలో గుబులు

విజిలెన్స్‌ దాడులు.. కేసులు..

పీడీ యాక్ట్‌.. అయినా ఆగని అక్రమాలు

ములుగులో అరెస్టులు..

హనుమకొండ లెక్కలపైనా ఆరా?

రూ. కోట్ల సీఎంఆర్‌

ఎగవేతదారులపైనా ఉచ్చు

పాత కేసులు.. బకాయిలు.. అధికారుల పాత్రపైనా దృష్టి?

ఇక ఆ బ్యాచ్‌పై అరెస్టుల కొరడా..

సీఎంఆర్‌ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిల్లర్లపై గతంలోనూ వివిధ స్థాయిల్లో చర్యలు జరిగాయి. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, పౌరసరఫరాల శాఖ అధికారులు పలు మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి స్టాక్‌ రిజిస్టర్లు, ధాన్యం నిల్వలు, మిల్లింగ్‌ రికార్డులు, సీఎంఆర్‌ సరఫరా వివరాలు పరిశీలించారు. కొన్ని సందర్భాల్లో క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. మరికొన్ని వ్యవహారాల్లో బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకున్నారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న కొందరిపై పీడీ యాక్ట్‌ కింద చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. అయినా సీఎంఆర్‌ అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడకపోవడంతో ఇప్పుడు సీఐడీ రంగంలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ములుగు కేసులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా పాత లావాదేవీలను కూడా పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement