హన్మకొండ: టీజీఎస్ హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో పని చేస్తున్న 13 మంది ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తూ ఆర్‌ఎం ఎస్.భవానీ ప్రసాద్ ఉత్తర్వులు అందించారు. 8 మంది మెకానికల్, ఐదుగురు ఆర్టిజన్‌లకు లీడింగ్ హ్యాండ్ పదోన్నతి కల్పించారు. ఈసందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ పదోన్నతి పొందిన ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం కిషన్‌రావు, పర్సనల్ ఆఫీసర్ వీరన్న పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని, 30వ జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా నవంబర్ 5న జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో ఉదయం 9గంటలకు పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 15 నుంచి 29 సంవత్సరాల్లోపు వయస్సు గల వారికి జానపద నృత్యం (గ్రూప్), జానపద గీతాలు (గ్రూప్), పెయింటింగ్, నుక్కడ్ నాటక్ (వీధి నాటకం), కవిత్వ రచన అనే అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనాలనుకునేవారు మైభారత్ పోర్టల్ https;//mybharat. gov. in/vbyld–2027లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు హనుమకొండ కాకతీయ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో, లేదా 79955 03018 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ ఉన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నవంబర్ 1 నుంచి టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ హెచ్‌ఎంలను ఆదేశించారు. ప్రతీ రోజు ఉదయం ఉన్నత పాఠశాలల్లో నిర్దేశించిన సమయం కంటే ముందుగా గంటపాటు ఒక సబ్జెక్టు టీచర్ ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జనవరి 12 వరకు ఈ ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని, ఆతర్వాత సంక్రాంతి సెలవుల అనంతరం మళ్లీ ఉదయం ఒకగంట, సాయంత్రం పాఠశాల సమయం ముగిశాక మరో గంట ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
హన్మకొండ చౌరస్తా: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించి అర్హులైన వారందరి ఓట్లు తిరిగి అందించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర పరిశీలకుడు కేబీఆర్ నాయుడు అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పిలుపు మేరకు ఓట్ బచావో – దేశ్ బచావో‘ మూడో దశ కార్యాచరణ సమావేశం సోమవారం హనుమకొండలోని కాంగ్రెస్ భవన్‌లో నిర్వహించారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నాయుడు మాట్లాడుతూ.. నవంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే భారీ జాతీయ ర్యాలీతో పాటు, నవంబర్ 25, 26 తేదీల్లో జరగబోయే ‘ఢిల్లీ చలో’ కార్యక్రమానికి జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీపీసీసీ కో–ఆర్డినేటర్ నర్సారెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎరబ్రెల్లి స్వర్ణ, మేర కో–ఆపరేటివ్ చైర్మన్ వెంకట్రాజం, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ పాల్గొన్నారు.
వరంగల్ అర్బన్ : గ్రూప్–1 పరీక్షల ద్వారా అసిస్టెంట్ ట్రెజరీ, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్లుగా ఎంపికై శిక్షణ తీసుకున్న తోట సోని, జి. రాహుల్‌లను బల్దియా కమిషనర్ టి.వెంకన్న సోమవారం అభినందించారు. గత మూడు రోజులుగా బల్దియా ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణ అనుభవాలు భవిష్యత్‌కు ఎంతగానో ఉపకరిస్తాయని కమిషనర్ తెలిపారు.


