వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ నగర ప్రజలకు మలాసురుడి రూపంలో ప్రమాదం పొంచి ఉంది. మానవ వ్యర్థాలను శాసీ్త్రయ పద్ధతిలో ఖననం (డిస్పోజ్) చేసే ప్లాంట్ సిద్ధమై ఏడాది దాటింది. అయినప్పటికీ బల్దియా పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. సెప్టిక్ ట్యాంకులను మూడేళ్లకోసారి శుభ్రం చేయకపోతే ఆరోగ్యానికి ప్రమాదమని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, ఓ వీడియోను కూడా విడుదల చేశారు. విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. అయినప్పటికీ ప్రజల్లో అవగాహన కల్పించడంలో బల్దియా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిర్లక్ష్యమేలా?
వరంగల్ నగర పరిధి అమ్మవారి పేటలో మొదటిసారిగా బిల్ గేట్స్ మిలిందా ఫౌండేషన్ సహకారంతో 2017లో రూ.1.20 కోట్లతో ప్లాంట్ నెలకొల్పారు. 2018లో బంక బయ్సో సహకరంతో జియో ట్యూబ్ మానవ వ్యర్థాల ప్లాంట్ నిర్మించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంీసీ), అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కీ) ఆధ్వర్యంలో సెప్టెక్ ట్యాంక్ శుభ్రతపై ప్రజలను జాగృతం చేస్తున్నారు. ఈరెండు ప్లాంట్ల ద్వారా రోజూ 25 కిలో లీటర్స్ ఫర్ డే (కేఎల్‌డీ) మానవ వ్యర్థాల శుద్ధి జరగడంతో వరంగల్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. కొన్నేళ్ల క్రితం బంక బయ్సో ద్వారా నిర్మించిన ప్లాంట్ మూత పడింది. మిలాందా ఫౌండేషన్ సహకరంతో నిర్మించిన ప్లాంట్ ప్రస్తుతం నడుస్తోంది. ఇక్కడ మలమూత్రాల వ్యర్థాలను శుద్ధీకరించి ఎరువుగా మారుస్తూ పంటలకు వినియోగిస్తున్నారు.
ఫోన్ చేస్తే చాలు..
టోల్ ఫ్రీ నంబర్ 18004 251980కు ఫోన్ చేస్తే చాలు. వెంటనే లైసెన్స్‌డ్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్‌కు సమాచారం వెళ్తుంది. సంబంధిత చిరునామాకు వచ్చి సెప్టిక్ ట్యాంక్‌ను ఖాళీ చేస్తారు. నామమాత్రపు రుసుము తీసుకుంటారు. బల్దియా ప్రధాన కార్యాలయం పనిదినాల్లో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆస్కీ ఆధ్వర్యంలో ప్రజల ఫిర్యాదులు నమోదు చేసుకుంటారు. – రాజమోహన్ రెడ్డి, ఆస్కీ ప్రతినిధి
మలాసురుడిపై యుద్ధం మరిచిన బల్దియా
మలమూత్ర వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్ నిరుపయోగం
రూ.6.82 కోట్లతో నిర్మాణం
ప్రజల్లో అవగాహన కల్పించడంపై అధికారుల వైఫల్యం
క్షేత్రస్థాయిలో అవగాహనేది?
సెప్టిక్ ట్యాంక్‌ను మూడేళ్లకోసారి ఖాళీ చేయాలని, లేకపోతే మల వ్యర్థాలు బయటకు వచ్చి పరిసరాలు కలుషితమవుతాయని అప్పట్లో ఆస్కీ ప్రతినిధులు, బల్దియా ప్రజారోగ్యం విభాగాధికారులు, సిబ్బంది విస్తృత అవగాహన కల్పించారు. ఆతర్వాత అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహించినట్లు ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌లోని 22 సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా అడపాదడపా శుద్ధి చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.
వైఫల్యం..
స్మార్ట్‌సిటీ నిధులు రూ.6.82 కోట్లతో 150 కేఎల్‌డీల కెపాసిటీతో ప్లాంట్ నిర్మించారు. మూడేళ్లుగా సాగిన ఈ ప్లాంట్ పనులు 95 శాతానికిపైగా పూర్తయ్యాయి. ట్రయల్ రన్ జరిగింది. సదరు కాంట్రాక్టర్‌కు పదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కానీ, రూ.కోటి మేరకు నిధులు బకాయి ఉందని సదరు కాంట్రాక్టర్ అడపాదడపా ప్లాంట్‌ను నడిపిస్తూ వచ్చారు. సదరు కాంట్రాక్టర్ నిర్వహణ కాలం పూర్తయ్యింది. డీ సిల్టింగ్ పనులు మాత్రమే నిలిచిపోయాయి. కాంట్రాక్టర్ మాత్రం బిల్లు చెల్లిస్తేనే మిగిలిన పనులు పూర్తి చేస్తామని భీష్మించుకుని కూర్చుననట్లు తెలుస్తోంది. ఈవిషయంపై బల్దియా ఎస్‌ఈ రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్, కమిషనర్ వెంకన్న దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో ప్లాంట్ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. మూడేళ్లకోసారి సెప్టిక్ ట్యాంక్‌లను క్లియర్ చేసుకునేలా గ్రేటర్ పరిధి ప్రజలకు నోటీసులు జారీ చేస్తున్నట్లు సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి తెలిపారు. కాగా, నగరంలో దాదాపు 2.50 లక్షల ఇళ్లు ఉండగా.. మూడేళ్లకోసారి క్లీన్ చేసుకోవాల్సిన వారు 9 ఏళ్లకోసారి చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు 15 మిలియన్ లీటర్లు మలమూత్ర శుద్ధీకరణ జరిగినట్లు చెబుతున్నారు.


