వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి కందుకూరి పూజ
కాశిబుగ్గ: బాలల హక్కుల పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్పన్ అభియాన్ (సురక్షిత బాల్యం ప్రచారం) కార్యక్రమాన్ని దేశాయిపేట, మామునూరు పాఠశాలల్లో నిర్వహించారు. ఈసందర్బంగా నా బిడ్డ–నా హక్కు (మై చైల్డ్ మై రైట్) అనే అంశంపై ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు ఎలాంటి వేధింపులు, సమస్యలు ఎదురైనా ధైర్యంగా న్యాయ సేవా సంస్థలను ఆశ్రయించాలని భరోసా ఇచ్చారు. పోక్సో చట్టం గురించి వివరించారు. అనంతరం బాలల హక్కుల పోస్టర్లు ఆవిష్కరించి, పాఠశాలల గోడలపై అంటించారు. కార్యక్రమంలో భరోసా కేంద్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ సువర్ణ, షీ టీమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్.రామారావు, హ్యూమన్ ట్రాఫికింగ్ సీఐ రమేశ్, లీగల్ ఎయిడ్ కౌన్సిలర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పోక్సో చట్టం.. రక్షణ కవచం
విద్యారణ్యపురి: పోక్సో చట్టం బాలికలకు రక్షణ కవచంలా ఉందని స్పెషల్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.అనూష అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో ‘సురక్షిత బచ్పన్ అభియాన్ – లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ’పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పిల్లలపై అనుమానాస్పద ప్రవర్తన లేదా వేధింపులు గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందించాలని సూచించారు. ఆ పాఠశాల హెచ్ఎం జీవీ రామారావు, హనుమకొండ సీఐ ప్రవీణ్, అడ్వకేట్ డి.మోహన్ ఉన్నారు.


