పోలీస్ కమిషనర్ శ్వేత
కాశిబుగ్గ: ‘చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలు బాగుంటాయి. అవి నాకెంతో ఇష్టం. చేనేత ఉత్పత్తులను అందరూ ఆదరించాలి’ అని పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. చేనేతపై అభిమానంతో సీపీ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం కొత్తవాడ వెళ్లి నేత ఉత్పత్తులు కొన్నారు. ఎలాంటి పోలీసు బందోబస్తు లేకుండా సాదాసీదాగా కుటుంబ సభ్యులతో కలిసి సీపీ కొత్తవాడ మగ్గాలను సందర్శించారు. మగ్గాల పనితీరు, కార్మికుల ప్రతిభను చూశారు. భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన కొత్తవాడ కార్పెట్లను పరిశీలించి, తయారు చేసే విధానం తెలుసుకున్నారు. ఉద్యోగ విరమణ రోజున టవల్స్ కప్పి, పూజా మ్యాట్ ఇచ్చి చేనేతను ప్రోత్సహించాలని సీపీ పిలుపునిచ్చారు. సీపీ శ్వేతను చేనేత సంఘాల ప్రతినిధులు చిప్ప వెంకటేశ్వర్లు, అడిగొప్పుల సంపత్, దువ్వల రాజేందర్, యెలుగం సాంబయ్య, జగన్, ఓం ప్రకాశ్ సన్మానించారు.
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికలు సోమవారం భట్టుపల్లిలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మైదానంలో జరిగాయి. పోటీల్లో దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు అసోసియేషన్ సెక్రటరీ తాబేటి రాజేందర్ తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ సరితరెడ్డి, సీఐ రంజిత్ కుమార్, రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ పిల్లి సాంబశివరావు, పెరుమాండ్ల సాంబమూర్తి, పీడీలు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో (సీడీఓఈ/ఎస్‌డీఎల్‌సీఈ) వివిధ పరీక్షలు ఇటీవల వాయిదా వేశారు. ఆయా పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ సోమవారం టైంటేబుల్ విడుదల చేశారు. దూరవిద్య పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 7న నిర్వహించనున్నారు. డిగ్రీ రెండో సంవత్సరం పరీక్షలు 8న, డిగ్రీ కోర్సుల ఫైనల్ ఇయర్ పరీక్షలు 9న నిర్వహించనున్నారు. దూరవిద్య పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు, డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ పరీక్షలు అక్టోబర్ 5న నిర్వహించనున్నారు. దూరవిద్య పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షలు 7న, దూరవిద్య పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు 9వ తేదీన నిర్వహిస్తారు.
ఎల్‌ఎల్‌బీ పరీక్షలు ఇలా..
కేయూ ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సు నాలుగో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 6న, మూడేళ్ల హానర్స్ రెండో సెమిస్టర్ పరీక్షలు 9న నిర్వహిస్తారని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల కోర్సు రెండో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 6న, ఎల్‌ఎల్‌బి ఐదేళ్ల కోర్సు ఎనిమిదో సెమిస్టర్ పరీక్షలు 6వ తేదీన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
న్యూశాయంపేట: ఆరోగ్య పరీక్షలు పూర్తిచేసుకున్న హజ్ యాత్రికులకు హనుమకొండ కాపువాడలోని హుమా నర్సింగ్‌హోంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సర్టిఫికెట్ల్లు పంపిణీ చేస్తున్నట్లు అంజుమనే హుజాజ్ హనుమకొండ అధ్యక్షుడు డాక్టర్ అనీస్ సిద్ధిఖీ ఒక ప్రకటనలో తెలిపారు.
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
కాజీపేట అర్బన్: ప్రభుత్వ భుములకు హద్దులు ఏర్పాటు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కాజీపేట మండలం మడికొండలో క్రిస్టియన్, ముస్లిం మతస్తులకు శ్మశానవాటిక కేటాయింపునకు ప్రతిపాదించిన స్ధలాన్ని సోమవారం కలెక్టర్ పరిశీలించారు. శ్మశానవాటిక కేటాయింపు ప్రతిపాదనలను సమర్పించాలని ఆర్టీఓ వెంకటేశ్, తహసీల్దార్ రాజును ఆదేశించారు.
భట్టుపల్లిలో..
కాజీపేట మండలం భట్టుపల్లిలో సోమవారం ఆర్డీఓ వెంకటేశ్, కాజీపేట తహసీల్దార్ రాజు గ్రామంలోని మైసమ్మ కట్ట నుంచి సబ్‌స్టేషన్ వ రకు భూముల రీసర్వే నిర్వహించారు. ఆర్‌ఐ కృష్ణ, సర్వేయర్ స్టాలిన్, జీపీఓ సంధ్య, లైసెన్స్‌డ్ సర్వేయర్ ప్రశాంత్ పాల్గొన్నారు.


