ఓటు హక్కుపై దాడిని సహించం | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కుపై దాడిని సహించం

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

ఓటు హక్కుపై దాడిని సహించం

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

హన్మకొండ అర్బన్‌: ఓటు హక్కును హరించే ఏ ప్రయత్నాన్నైనా సహించబోమని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు, తొలగింపులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాహుల్‌ గాంధీ ఓటు చోరీ అంశంపై చేపడుతున్న పోరాటానికి మద్దతుగా సోమవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని పాల్గొన్నారు. హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరియం నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండాలంటే ప్రతీ దశ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు, ఓటర్ల తొలగింపులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌గౌడ్‌, దుద్దిళ్ల శ్రీనుబాబు, ఈవీ శ్రీనివాస్‌రావు, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీని వాస్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

పోచమ్మమైదాన్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల నిరసన

కాశిబుగ్గ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ పోచమ్మమైదాన్‌ సెంటర్‌లో ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మానవహారం, నిరసన, సీఈసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయూబ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ ఎన్నికల వ్యవస్థలను రాజకీయంగా వాడుకుంటుందన్నారు. అనంతరం కలెక్టర్‌ సత్యశారదను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఓర్సు తిరుపతి, కర్నాటి పార్వతమ్మ, రవీందర్‌ నాయక్‌, చిలువేరు శ్రీనివాస్‌, దాడి శివ, ఎడ్ల రవికుమార్‌, పోశాల వెంకన్న పాల్గొన్నారు.

పోచమ్మమైదాన్‌ సెంటర్‌లో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్సీ సారయ్య, కుడా చైర్‌పర్సన్‌ సుధారాణి, డీసీసీ అధ్యక్షుడు అయూబ్‌, నాయకులు

నిరసన ర్యాలీలో పాల్గొన్న ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి, తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement