తొలి సెమిస్టర్‌ రాయకముందే.. రెండో సెమిస్టర్‌ హాల్‌టికెట్లు! | - | Sakshi
Sakshi News home page

తొలి సెమిస్టర్‌ రాయకముందే.. రెండో సెమిస్టర్‌ హాల్‌టికెట్లు!

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

తొలి సెమిస్టర్‌ రాయకముందే.. రెండో సెమిస్టర్‌ హాల్‌టికెట్లు!

సాక్షి, వరంగల్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ అండ్‌ కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్‌డీఎల్‌సీఈ) పరీక్షల నిర్వహణలో గందరగోళం నెలకొంది. డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్ష రాయకముందే రెండో సెమిస్టర్‌ పరీక్షకు హాల్‌టికెట్లు జారీ కావడం విద్యార్థుల్లో అయోమయానికి దారితీసింది. 356 మంది విద్యార్థులకు ఈ పరిస్థితి ఎదురైంది. ఎస్‌డీఎల్‌సీఈ విభాగం నుంచి ఎగ్జామినేషన్‌ విభాగానికి పంపిన జాబితాలోనే తప్పులు ఉండడంతో యథావిధిగా కేయూ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారనే విమర్శలున్నాయి. ఆయా విద్యార్థులకు జారీ చేసిన హాల్‌టికెట్లపై ‘యూజీ టు సెమిస్టర్‌ (ఆర్‌ఈజీ) ఎగ్జామినేషన్స్‌, సెప్టెంబర్‌ 2026’ అని స్పష్టంగా ముద్రించి ఆరు సబ్జెక్టులను హాల్‌టికెట్‌లో పొందుపర్చారు. సంబంధిత విద్యార్థులు ఇంకా మొదటి సెమిస్టర్‌ పరీక్ష రాయలేదని చెబుతున్నారు. డిసెంబర్‌లో తొలి సెమిస్టర్‌ పరీక్షలు రాయాల్సి ఉండగా.. అప్పుడే పరీక్షలంటూ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటూ విద్యార్థులకు కేయూనుంచి ఎస్‌ఎంఎస్‌లు రావడంతో చాలామంది విద్యార్థులు ఖంగుతిన్నారు. దూరవిద్యలో చదువుతున్న ఈ విద్యార్థులు ఇప్పుడు ఆయా సెంటర్లకు వెళ్తే అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న ఆందోళనలో ఉన్నారు. ఇలా ఎస్‌డీఎల్‌సీఈ, పరీక్షల విభాగం సమన్వయ లోపంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని వర్సిటీ వర్గాలే అంటుండడం గమనార్హం.

పొరపాటుపై చర్యలుండాల్సిందే..

సెమిస్టర్‌ విధానంలో మొదటి సెమిస్టర్‌ అనంతరం రెండో సెమిస్టర్‌ వస్తుంది. అలాంటప్పుడు తొలి సెమిస్టర్‌ పరీక్షకే హాజరుకాని విద్యార్థులకు రెండో సెమిస్టర్‌ హాల్‌టికెట్‌ ఎలా జారీ అయిందన్నది ప్రశ్నగా మారింది. విద్యార్థి డాటా నమోదు సమయంలో పొరపాటు జరిగిందా? పరీక్ష దరఖాస్తులో సెమిస్టర్‌ తప్పుగా నమోదైందా? లేక హాల్‌టికెట్ల జనరేషన్‌లో సాంకేతిక లోపం తలెత్తిందా? అన్న ప్రశ్నలను వర్సిటీ పరీక్ష విభాగాధికారుల వద్ద ప్రస్తావిస్తే ఎస్‌డీఎల్‌సీఈ నుంచి వచ్చిన డాటానే అప్‌లోడ్‌ చేశామనే సమాధానం చెబుతున్నారు. హాల్‌టికెట్‌ విద్యార్థి ఏ కోర్సు, ఏ సెమిస్టర్‌, ఏ సబ్జెక్టులకు పరీక్ష రాయాలో నిర్ధారించే కీలక పత్రం. అందులోనే తప్పులు దొర్లితే పరీక్ష సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా దూరవిద్య విద్యార్థులు పరీక్షల షెడ్యూల్‌, హాల్‌టికెట్లపైనే ఆధారపడుతుండడంతో ఇలాంటి గందరగోళం మరింత ప్రభావం చూపుతుంది. దిద్దుబాటు చర్యలు తీసుకుని ఆయా విద్యార్థులకు మళ్లీ సమాచారం ఇవ్వాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని విద్యార్థులు కోరుతున్నారు.

తప్పుడు హాల్‌టికెట్లు వాస్తవమే..

దూరవిద్యా విధానంలో డిగ్రీ కోర్సులో తొలి సంవత్సరం చదువుతున్న 356 మంది విద్యార్థులకు జారీ అయిన హాల్‌ టికెట్లు రెండో సెమిస్టర్‌ ఉన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఎస్‌డీఎల్‌సీఈ నుంచి వచ్చిన డాటా ఆధారంగానే వర్సిటీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అప్‌లోడ్‌ చేసి విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటూ వారి సెల్‌ఫోన్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌లు వెళ్లాయి. వీరికి తొలి సెమిస్టర్‌ పరీక్షలు డి సెంబర్‌లో జరుగుతాయి. ఒకవేళ ఆయా హాల్‌టికె ట్లు తీసుకొని పరీక్షకేంద్రాలకు వెళ్లినా.. అనుమతించరు. ఆన్‌లైన్‌లో రెండో సెమిస్టర్‌ హాల్‌టికెట్లు అందుబాటులో లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

– కట్ల రాజేందర్‌,

కేయూ పరీక్షల నియంత్రణ విభాగాధికారి

కేయూ ఎస్‌డీఎల్‌సీఈ పరీక్షల

విభాగం తీరుపై విమర్శలు

హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటూ విద్యార్థులకు ఎస్‌ఎంఎస్‌లు

అధికారులకు ఫిర్యాదు చేయడంతో లోపాలు వెలుగులోకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement