ఖిలా వరంగల్: మామునూరు ఎయిర్‌పోర్ట్ పనుల్లో మరో అడుగు పడింది. ఇప్పటికే రూ.203.49 కోట్ల అంచనా వ్యయంతో రన్‌వే ఆధునికీకరణ, ట్యాక్సీ వేలు, విమానాల పార్కింగ్ ఆప్రాన్, టెర్మినల్‌కు అనుసంధాన రహదారులు, గ్రౌండ్ సపోర్ట్, పలు మౌలిక వసతుల పనులకు టెండర్లు పిలిచిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ).. తాజాగా మరో రూ.213.59 కోట్లతో నూతన డొమెస్టిక్ టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్ కమ్ టెక్నికల్ బ్లాక్, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్, ఫైర్‌స్టేషన్, ఈ అండ్ ఎం వర్క్‌షాప్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. ఈమొత్తం పనులను 18 నెలల వ్యవధిలో పూర్తి చేసేలా ఏఏఐ గడువు నిర్దేశించింది. దీంతో ఎయిర్‌పోర్టు పనులు మరో కీలక దశలోకి చేరాయి.
నవంబర్ 3వరకు బిడ్ల దాఖలు
ఈ ప్యాకేజీకి అక్టోబర్ 6 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు బిడ్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. నవంబర్ 9న టెక్నికల్ బిడ్లను, నవంబర్ 30న ఫైనాన్షియల్ బిడ్లను తెరవనున్నట్లు ఏఏఐ అఽధికారులు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎంపికై న సంస్థకు పనులు అప్పగించి, నిర్ణీత వ్యవధిలో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.
ఎయిర్‌పోర్ట్ సందర్శన
మామునూరు విమానాశ్రయాన్ని సోమవారం టెండర్‌దారులతో కలిసి ఏఏఐ ఆధికారులు సందర్శించారు. పాత రన్‌వేతోపాటు ప్రతిపాదిత నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో నిర్వహించిన ప్రీ–బిడ్ సమావేశంలో రూ.213.59 కోట్ల ప్యాకేజీతో చేపట్టనున్న నిర్మాణాలు, సాంకేతిక అంశాలు, టెండర్ నిబంధనలపై టెండర్‌దారులకు అధికారులు వివరించారు. టెండర్‌దారుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏఏఐ ఏజీఎం నాగరాజు, తహసీల్దార్ ఇక్బాల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎయిర్‌పోర్ట్ పనుల్లో మరో అడుగు
తాజాగా రూ.213.59 కోట్లతో
టెండర్లకు ఆహ్వానం
మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించిన ఏఏఐ అధికారులు, టెండర్‌దారులు


