విద్యావ్యవస్థ కాషాయీకరణకు కుట్ర | - | Sakshi
Sakshi News home page

విద్యావ్యవస్థ కాషాయీకరణకు కుట్ర

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

కేయూ క్యాంపస్‌ : దేశంలో విద్యా వ్యవస్థను కాషాయీకరణ చేసేందుకు పాలక వర్గాలు కుట్రలు చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సోమవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) 90వ వార్షికోత్సవం సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సాంబశివరావు భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఏఐఎస్‌ఎఫ్‌ ఆవిర్భవించి 90ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. కమ్యూనిస్టు భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న ఏఐఎస్‌ఎఫ్‌ భగత్‌సింగ్‌ వారసత్వంతోనే ఆవిర్భవించిందన్నారు. నాటి ప్రధానులు నెహ్రూ, అటల్‌జీ వంటి వారు కూడా ఈ సంఘంలో పనిచేశారని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలో కాషాయీకరణను చొప్పిస్తూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని విమర్శించారు. ఒకప్పుడు విద్యాసంస్థల్లో ఎన్నికలు ఉండేవని, నాటి ఆర్‌ఈసీ తదితర సంస్థల్లో ఎంతోమంది విప్లవ నాయకులు ఎదిగి సమాజానికి సేవలను అందించారన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్‌ సిరంగి రాజన్‌ మాట్లాడుతూ.. దేశంలో పాలకవర్గాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను మార్చే శక్తి విద్యార్థులకు ఉందని పేర్కొన్నారు. ఈ సభలో ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌, తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ ఇన్‌చార్జ్‌ రెహమాన్‌, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి ప్రణీత్‌గౌడ్‌, కార్యదర్శి భాషబోయిన సంతోష, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు దిడ్డి పార్దసారథి, కార్యదర్శి లాదెళ్ల శరత్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

వేలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన..

ఏఐఎస్‌ఎఫ్‌ 90వ వార్షికోత్సవం సందర్భంగా పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి వివిధ కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కేయూ ఆడిటోరియం కిక్కిరిసి పోయింది. ఈ సభలో ప్రజానాట్య మండలి కళాకారులు పాటలతో ఆకట్టుకున్నారు.

పాట సీడీ ఆవిష్కరణ

ఏఐఎస్‌ఎఫ్‌ 90 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా జాతీయ మాజీ అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు రచించిన పాట సీడీని ఎమ్మెల్యే సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ పాటను ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ కళాబృందం గానం చేసింది. సాంబశివరావును ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ, రాష్ట్ర నాయకులు సన్మానించారు. మంగళ, బుధవారాల్లో బాలవికాసలో ప్రతినిధుల సభ జరగనుంది.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కేయూలో ఏఐఎస్‌ఎఫ్‌ 90వ వార్షికోత్సవ బహిరంగ సభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement