గురుకులాల్లో భద్రతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో భద్రతకు ప్రాధాన్యం

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

హన్మకొండ అర్బన్‌/న్యూశాయంపేట : రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు.. జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి విద్యాసంస్థల నిర్వహణ, వసతులపై సమీక్షించారు. ఫుడ్‌పాయిజన్‌, ఎలుకలు, పాముకాటు ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్‌, హనుమకొండ కలెక్టరేట్ల నుంచి కలెక్టర్లు చాహత్‌ బాజ్‌పాయ్‌, డాక్టర్‌ సత్యశారద పాల్గొన్నారు. రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలను కలెక్టర్లు క్రమం తప్పకుండా ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్లు బి.శేషాద్రి, వైవీ గణేశ్‌, శిక్షణ కలెక్టర్‌ రోహిత్‌ నేత, డీఈఓలు గిరిరాజ్‌ గౌడ్‌, రంగయ్యనాయుడు, సంక్షేమ శాఖల, రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల పర్యవేక్షణ అధికారులు పాల్గొన్నారు.

అక్టోబర్‌ 11 నుంచి ఓపెన్‌ పరీక్షలు

కాళోజీ సెంటర్‌: తెలంగాణ ఓపెన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు అక్టోబర్‌ 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వరంగల్‌ జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్యనాయుడు, ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ సదానందం తెలిపారు. పరీక్షల హాల్‌టికెట్లు సెప్టెంబర్‌ 26 నుంచి అధికారిక వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. తెలంగాణ ఓపెన్‌స్కూల్‌.ఓఆర్‌జీలో అందుబాటులో ఉన్నాయన్నారు. పరీక్షకు హాజరయ్యే ప్రతీ అభ్యర్థి హాల్‌టికెట్‌తో పాటు ఒరిజినల్‌ ఆధార్‌ కార్డును వెంట తెచ్చుకోవాలన్నారు.

విద్యుదాఘాతంతో మహిళ మృతి

హన్మకొండ చౌరస్తా : విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందిన ఘటన ఆదివారం సాయంత్రం హనుమకొండలోని సుధానగర్‌లో చోటుచేసుకుంది. మృతురాలి కుమార్తె తిగుల్ల యమున కథనం ప్రకారం.. సుధానగర్‌కు చెందిన రుద్రారం లక్ష్మి (58) స్నానం చేసేందుకు వేడి నీటి కోసం బకెట్‌లో హీటర్‌ పెట్టింది. నీరు వేడైనా తర్వాత హీటర్‌ను తీసివేసే క్రమంలో చేయి తగిలి విద్యుత్‌ షాక్‌ గురైంది. గమనించిన కూతురు స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతిచెందింది. యమున ఫిర్యాదు మేరకు హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం..

కాజీపేట అర్బన్‌ : మడికొండ ఓఆర్‌ఆర్‌ ఎల్కుర్తి క్రాస్‌ వద్ద సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ట్రాలీ ఆటో డ్రైవర్‌ మృతి చెందాడు. మడికొండ ఎస్సై రాజ్‌కుమార్‌ కథనం ప్రకారం.. కాజీపేట మండలం మడికొండకు చెందిన దువ్వ శ్రీనివాస్‌ (50) ట్రాలీ ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే ట్రాలీ ఆటోలో పెద్దపెండ్యాల వద్ద సిమెంట్‌ అన్‌లోడ్‌ చేసి ఓఆర్‌ఆర్‌ మీదుగా మడికొండకు వస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొట్టి వెళ్లిపోగా సంఘటన స్ధలంలోనే శ్రీనివాస్‌ మృతి చెందాడు. మృతదేహాన్ని టోల్‌ప్లాజా అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించినట్లు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

ఎక్స్‌ప్రెస్‌ బస్సుల తగ్గింపుతో ప్రమాదం

● బస్సు దిగుతూ ప్రమాదానికి గురైన మహిళ

హన్మకొండ : ఎక్స్‌ప్రెస్‌ బస్సుల తగ్గింపు ప్రమాదాలకు దారి తీస్తుంది. హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌ నుంచి హైదరాబాద్‌తో పాటు పలు ప్రధాన రూట్లలో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు చాలా వరకు తగ్గించింది. దీంతో వచ్చిన బస్సు మహిళా ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రేగొండ మండలం దమ్మన్నపేటకు చెందిన అత్తకోడలు చుక్క నిర్మల, గౌతమి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఎక్కారు. సీటు దొరక్కపోవడంతో పాటు నిలబడేందుకు కాలు పెట్టే స్థలం లేకపోవడంతో నిర్మల బస్సు దిగుతుండగా బస్సు కదలడంతో కింద పడిపోయింది. ఆమె ఎడమ కాలుపై నుంచి టైరు వెళ్లడంతో కా లు నుజ్జునుజ్జయింది. వెంటనే చికిత్స కోసం 108లో ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. కాగా నిర్మల భర్త శ్రీనివాస్‌, కుమారుడు వెంకటేశ్‌ మాట్లాడుతూ..ఈ ప్రమాదానికి ఆర్టీసీ పూర్తి బాధ్యత వహించాలని, వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement