కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో బుధవారం చేపట్టనున్న డివిజనల్ లోకో సమ్మెట్‌ను విజయవంతం చేయాలని సంఘ్ కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని వెంకటనారాయణ, అవారి మధుసూదన్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం కాజీపేట అన్ని బ్రాంచ్‌ల సంఘ్ నాయకులు, ఆఫీస్ బేరర్లు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. సికింద్రాబాద్ డివిజన్ స్థాయిలో లోకో రన్నింగ్ స్టాప్ సమస్యలను తెలుసుకోవడానికి ఎన్‌ఎఫ్‌ఐఆర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం.రాఘవయ్య కాజీపేటకు రానున్నట్లు తెలిపారు.
తరగతులు కావడం లేదని..
● ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థుల ఆందోళన
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో బీపీఈడీ విద్యార్థులు తమకు క్లాస్‌లు సరిగా జరగడం లేదని నిరసిస్తూ సోమవారం యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ కూడా సక్రమంగా తరగతులు జరిగేలా తగిన చర్యలు చేపట్టడం లేదని రిజిస్ట్రార్ వి.రామచంద్రం దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. ఆందోళన చేస్తున్న బీపీఈడీ విద్యార్థులు రిజిస్ట్రార్ చాంబర్‌కు రాగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యను వీసీ ప్రతాప్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు. అక్కడికి ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్‌ను కూడా పిలిపించి మాట్లాడారు. ఈ విషయంపై కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంను వివరణ కోరగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో రెగ్యులర్ అధ్యాపకులు లేరని ప్రస్తుతం నలుగురు అధ్యాపకులే పని చేస్తున్నారని తెలిపారు. 8 మంది అధ్యాపకుల అవసరం ఉందని అధ్యాపకుల కొరతతో బీపీఈడీ విద్యార్థులకు తరగతులు జరగడం లేదని రామచంద్రం వివరణ ఇచ్చారు.గత విద్యా సంవత్సరంలో పేపర్ వైజ్‌గా తాత్కాలిక అధ్యాపకులు విధులు నిర్వర్తించారని వారిని ప్రస్తుతానికి విధుల్లోకి తీసుకొని ఈనెల 29నుంచి బీపీఈడీ విద్యార్థులకు తరగతులు యథావిధిగా నిర్వహిస్తామని విద్యార్థులకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారని రిజిస్ట్రార్ వివరణ ఇచ్చారు. వివిధ కారణాలతో ఆ కాలేజీకి సంబంధించి పార్ట్‌టైం అధ్యాపకుల నియమకాలు జరగలేదన్నారు.


