ప్రతీరోజు మైదానానికి తీసుకెళ్లేవాడిని.. | - | Sakshi
Sakshi News home page

ప్రతీరోజు మైదానానికి తీసుకెళ్లేవాడిని..

Sep 27 2026 4:04 AM | Updated on Sep 27 2026 4:04 AM

తండ్రి స్ఫూర్తితో కూతురు

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఆడపిల్ల పుట్టిందంటే పెళ్లి నాటికి బంగారం, డబ్బులు, ప్లాట్లు సంపాదిస్తే చాలు.. కూతురుకు బంగారు భవిష్యత్‌ అందించొచ్చు. ఇది సగటు సాధారణ తండ్రి ఆలోచన. అందుకు భిన్నంగా ఓ తండ్రి తన కూతురును అంతర్జాతీయ వేదికపై తల ఎత్తి చూడాలని తలచారు. తన లక్ష్యం కోసం కూతురును క్రీడా దిగ్గజంగా మలిచేందుకు పరితపించారు. చూస్తుండగానే తన లక్ష్యానికి కూతురు చేరువయ్యింది. వచ్చే నెల 12 నుంచి 18వ తేదీ వరకు చైనాలో జరగనున్న ఐదో ఏషియా కప్‌ టోర్నమెంట్‌లో అండర్‌–15 బాలికల విభాగంలో భారత జట్టు నుంచి పాల్గొననుంది. హనుమకొండలోని కేఎల్‌ఎన్‌రెడ్డికాలనీ సమీపంలో శాంతినగర్‌కు చెందిన వేల్పుల అనిల్‌ సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అనిల్‌, సుజాత దంపతులకు కూతురు సాయివర్షిణి, కుమారుడు సాయివర్షిత్‌ ఉన్నారు. కూతురు సాయివర్షిణి ఎదిగిన తీరును ‘డాటర్స్‌ డే’ సందర్భంగా తండ్రి అనిల్‌ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ప్రశ్న: సాయివర్షిణికి సాఫ్ట్‌బాల్‌పై

ఆసక్తిని ఎప్పుడు గుర్తించారు

సాయివర్షిణి పుట్టగానే క్రీడాకారిణిగా తయారు చేయాలని నిశ్చయించుకున్నా. నాలుగో తరగతి చదువుతుండగా ప్రతీ రోజు మైదానానికి తీసుకెళ్లేవాడిని. స్టేడియంలో క్రీడాకారులను చూపుతూ క్రీడలపై ఆసక్తి పెరిగేలా బోధించేవాడిని. కొద్ది రోజులు గమనించాక సాఫ్ట్‌బాల్‌ వైపు సాయివర్షిణి ఆసక్తి చూపెట్టింది.

ప్రశ్న: ఎక్కడ శిక్షణ ఇప్పించారు

ప్రతీ రోజు జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం తీసుకెళ్తున్న క్రమంలో సాఫ్ట్‌బాల్‌ క్రీడ పట్ల ఆసక్తి కనబరిచింది. అక్కడే శిక్షణ ఇస్తున్న కోచ్‌ వినయ్‌ వద్ద జాయిన్‌ చేశా. నాలుగు సంవత్సరాలుగా వినయ్‌ వద్ద శిక్షణ పొందుతోంది. ప్రతీ రోజు రెండు గంటలకు పైగా సాధన చేస్తుంది. ప్రస్తుతం పిచ్చర్‌గా భారత జట్టులో స్థానం దక్కించుకుంది.

ప్రశ్న: సాయివర్షిణి చదువు,

ఆటపై ఎలా దృష్టి పెడుతున్నారు

సాయివర్షిణి చిన్నప్పటి నుంచే ఏదైనా సరే ఒకసారి చెబితే చాలు ఇట్టే పట్టేస్తుంది. ప్రస్తుతం హంటర్‌రోడ్‌లోని గ్రీన్‌వుడ్‌ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. ఏ రోజు కూడా చదువులో వెనుకంజ వేయలేదు. సాయంత్రం స్టేడియానికి వెళ్లి రాగానే పుస్తకాలు పడుతుంది. ఏ రోజు కూడా అలసిపోయా.. చదువుకోలేను అని చెప్పలేదు.

ప్రశ్న: తల్లిదండ్రులుగా కూతురు

ఈ స్థాయికి ఎంపిక కావడం ఎలా ఫీలవుతున్నారు

నా కూతురుని అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచమంతా తల ఎత్తుకుని చూడాలన్న మా ఆశయం, ఆలోచనలను ఒంటబట్టించుకుని భారత జట్టుకు ఎంపిక కావడం మాటల్లో చెప్పలేని సంతృప్తిగా ఉంది. ఈ విషయాన్ని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నా. భవిష్యత్‌లో మరింత స్థాయికి ఎదుగుతుందని ధీమా కలుగుతోంది.

దగ్గరుండి సాఫ్ట్‌బాల్‌ క్రీడలో శిక్షణ

నా కూతురు సాయివర్షిణి సాఫ్ట్‌బాల్‌ భారత జట్టుకు ఎంపిక సంతృప్తినిచ్చింది..

తండ్రి కానిస్టేబుల్‌ వేల్పుల అనిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement