● ఉధృతం కానున్న ప్రచారం
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ యూనియన్ ఎన్నికలకు కార్మిక శాఖ శనివారం గుర్తులు కేటాయించింది. దీంతో ఎన్నికల నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చింది. ఇప్పటికే మొదలు పెట్టిన ప్రచారం గుర్తుల కేటాయింపుతో ఉధృతం కానుంది. గతంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు కేటాయించిన విల్లు, బాణం గుర్తును తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు కేటాయించారు. ఆర్టీసీ సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు బతుకమ్మ, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు నిచ్చెన, టీఎస్ ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్‌కు కత్తెర, టీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ బస్, టీఎస్ ఆర్టీసీ కార్మిక పరిషత్‌కు బస్ టైర్, టీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘ్‌కు టైగర్, టీఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్‌కు ధర్మచక్ర, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్‌కు నక్షత్రం, నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు కాగడ, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు తరాజు, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్‌కు గధ గుర్తును కార్మిక శాఖ కేటాయించింది.
తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ సంబరాలు..
తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (అశ్వత్థామ రెడ్డి వర్గం)కు విల్లు, బాణం గుర్తు కేటాయించడంతో ఆ యూ నియన్ సంబరాలు చేసుకుంది. గతంలో టీఎంయూగా కొనసాగిన అశ్వత్థామ రెడ్డి వర్గం గుర్తింపు ఎన్నికలో తెలంగాణ ఆ ర్టీసీ వర్కర్స్ యూనియన్‌గా పోటీ చేస్తుంది. అయితే గతంలో టీఎంయూ గుర్తుగా కార్మికుల్లోకి విస్తృతంగా ప్రచారంలో ఉన్న విల్లు, బాణం గుర్తు తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు కేటాయించడంతో శనివారం రాత్రి హనుమకొండలోని వరంగల్–1, వరంగల్–2, హనుమకొండ డిపోల వద్ద బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు జితేందర్ రెడ్డి, ఎస్.కె.వై.పాషా, రాతిపల్లి సాంబయ్య, జి.సత్తయ్య, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.


