ఖిలా వరంగల్ : వాకింగ్ వెళ్లిన ఓ వ్యక్తి విగత జీవిగా మారాడు. మద్యం మత్తు, స్నేక్ డ్రైవ్‌తో అతివేగంగా దూసుకొచ్చిన ద్విచక్రవాహనం(బైక్) అతడిని బలితీసుకుంది. ఈ ఘటన వరంగల్ 39వ డివిజన్ జన్మభూమి జంక్షన్ నుంచి కాశికుంటకు వెళ్లే రహదారిపై చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ 39వ డివిజన్ ఏకశిల నగర్‌కు చెందిన బత్తుల కిషన్(60) రియల్ స్టేట్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజువారీగానే శనివారం ఉదయం 6గంటల సమయంలో జన్మభూమి జంక్షన్ రోడ్డులో వాకింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో కరీమాబాద్‌కు చెందిన శ్యామ్ మణిభూషణ్ కాశికుంట వెళ్లే రహదారిపై పల్సర్ బైక్‌పై మద్యం మత్తు,స్నేక్ డ్రైవ్‌తో వెనుక నుంచి కిషన్‌ను ఢీకొన్నాడు. దీంతో కిషన్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. శ్యామ్ మణిభూషణ్ రోడ్డుపై పడిపోవడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే 108లో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మిల్స్‌కాలనీ ఎస్సై శ్రవణ్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య సుగుణ, కుమారుడు శ్రీధర్, కుమార్తెలు మాధవి, మమత ఉన్నారు. కుమారుడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ కర్రె స్వామి తెలిపారు. కాగా, రక్తపు మడుగులో ఉన్న కిషన్ మృతదేహం మీద పడి కుటుంబీకులు బోరున విలపించారు. ఇక తమకు దిక్కెవరంటూ గుండెలవిసేలా రోదించారు.
బైక్ ఢీకొనడంతో వ్యక్తి దుర్మరణం
వరంగల్ జన్మభూమి రోడ్డులో ఘటన


