ముగ్గురు విశ్రాంత ఆచార్యులకు ప్రతిభా పురస్కారాలు
● వారి సాహిత్య, సంగీత, పరిశోధన సేవలను కొనియాడిన సాహిత్యలోకం
● అక్టోబర్ 3న బాచుపల్లిలో అవార్డుల ప్రదానం
హన్మకొండ కల్చరల్: తెలుగు సాహిత్యం, సంగీతం, జానపద పరిశోధన రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖలు.. విశ్రాంత ఆచార్యులు కాత్యాయనీ విద్మహే, దుడ్డు సీతారామయ్య, వరంగల్ విద్యారణ్య సంగీత నృత్య కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ నాగపట్ల భక్తవత్సలరెడ్డికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలు–26 అందించనుంది. హైదారాబాద్ బాచుపల్లిలోని యూనివర్సిటీ క్యాంపస్ ప్రాంగణంలో.. అక్టోబర్ 3న వీరు పురస్కారాలు అందుకోనున్నారు. ఈ ముగ్గురు వరంగల్‌లో ప్రభుత్వ శాఖల్లో సేవలందించి ఉద్యోగ విరమణ పొందారు.
సాహిత్య పరిశోధన
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో సుఽధీర్ఘకాలం అధ్యాపకురాలిగా, ప్రొఫెసర్‌గా కాత్యాయనీ విద్మహే సేవలందించారు. హాస్టల్ వార్డెన్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్, తెలుగు విభాగాధిపతి, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్, విద్యార్ధి సంక్షేమ కేంద్రం డైరెక్టర్, మహిళా అధ్యయన కేంద్రం డైరెక్టర్, ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ తదితర బాధ్యతలు నిర్వహించారు. తెలుగు సాహిత్యంపై విస్తృతంగా పరిశోధనలు చేసిన ఆమె.. మహిళా సాహిత్యం, సాహిత్యంలో లింగ దృక్పథం, రాజకీయ ఆర్థిక భావనలపై అధ్యయనం చేశారు. తెలుగు సాహిత్యంపై 412 పరిశోధన పత్రాలు, 27 పుస్తకాలు ప్రచురించారు. 30 పుస్తక సమీక్షలు, 55 ముందు మాటలు రాశారు. 34 సాహిత్య రచనలకు సంపాదకత్వం వహించారు. దేశవ్యాప్తంగా 200కుపైగా జాతీయ స్థాయి సదస్సుల్లో పరిశోధన పత్రాలు సమర్పించి, ఉపన్యాసాలు ఇచ్చారు. ఆమె పర్యవేక్షణలో 12 మంది పరిశోధకులు పీహెచ్‌డీ, 31 మంది ఎంఫిల్ పట్టాలు పొందారు. యూజీసీ, కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాయోజిత పలు పరిశోధన ప్రాజెక్టుల్లో పనిచేశారు. మహిళా సాహిత్యంపై నిర్వహించిన జాతీయ స్థాయి సెమినార్లు, మహిళా రాజకీయ సాధికారతపై చేపట్టిన క్షేత్రస్థాయి అధ్యయనాలు, మహిళా అధ్యయనాల జర్నల్ ప్రారంభం వంటి కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం మహిళా రచయితల సాహిత్యంపై రచనలు చేస్తూ, పలు సాహిత్య సంస్థలతో కొనసాగుతున్నారు.
నిత్య పరిశోధకుడు భక్తవత్సలరెడ్డి
1995లో అప్పటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠం వరంగల్ ప్రాంగణంలో ఆచార్యులుగా, డీన్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి సుదీర్ఘకాలం భక్తవత్సలరెడ్డి విశేష సేవలందించారు. 2008లో ఉద్యోగ విరమణ చేశారు. 2007 నుంచి 2008 వరకు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా కొనసాగారు. గ్రామీణ విజ్ఞానం, జాతర్లు, కొలుపులు, తిరునాళ్లు, జానపద కళారూపాలు, దక్షిణ భారతీయ అనుష్టాన సంప్రదాయం మీద అనేక పరిశోధనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు. ఆయన పర్యవేక్షణలో ఎందరో విద్యార్ధులు జానపద గిరినులపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందారు. చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నారు.
నాలుగు దశాబ్దాలుగా వీణా నాదం
సంగీత కుటుంబంలో జన్మించిన దుడ్డు సీతారామయ్య 2011 నుంచి 2014 వరకు వరంగల్ విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విదేశీ దేశాధినేతల, ప్రముఖుల సమక్షంలో ఆయన వీణా కచేరీలు నిర్వహించారు. పూర్వ విధ్వాంసుల సంప్రదాయంలో వీణను నిలబెట్టి వాయించే ఊర్ధ్వ వీణ పద్ధతిలో ప్రదర్శనలివ్వడం ఆయన ప్రత్యేకత. వీణలోని తానంను సులభంగా నేర్చుకునేందుకు వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో ఉచితంగా అందుబాటులో ఉంచారు. ఎందరికో సంగీత పాఠాలు నేర్పిన ఈయన సేవలకు పురస్కారం దక్కడంపై సంగీతాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


