సాక్షి ప్రతినిధి, వరంగల్:
ఓరుగల్లు నగరానికి దశాబ్దాలుగా ఉన్న భూగర్భ డ్రెయినేజీ (యూజీడీ) కల సాకారమయ్యే సమయం ఎప్పుడొస్తుందా? అని నగరవాసులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడంతో ఇక పనులు ప్రారంభమవుతాయని ఆశించిన ప్రజలకు మాత్రం ఇంకా నిరీక్షణే మిగిలింది. ‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా నిధులు.. డీపీఆర్.. అనుమతులు.. ఆర్థిక వనరుల సమీకరణ.. అన్నీ ఒక్కొక్కటిగా ముందుకు కదులుతున్నా.. టెండర్ల ప్రక్రియ మాత్రం ముందుకు కదలడం లేదు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల వినతి మేరకు సీఎం రేవంత్‌రెడ్డి 2024 జూన్ 29న నిర్వహించిన జీడబ్ల్యూఎంసీ సమీక్షలో నగరానికి అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు అధికారులను ఆదేశించారు. ఆతర్వాత అదే ఏడాది నవంబర్‌లో డీపీఆర్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ పరిధిలో సమగ్ర యూజీడీ వ్యవస్థ కోసం రూ.4,170 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
ఆరు నెలలైనా కదలని టెండర్ల ప్రక్రియ..
ప్రాజెక్టు రూపకల్పన, డీపీఆర్, భవిష్యత్ జనాభా అవసరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత యూజీడీ ప్రాజెక్టు పరిమాణం మరింత పెరిగింది. 2026 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,257.20 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది. ఇది కేవలం పాత డ్రెయినేజీ పైపులు మార్చే పనికాదు. భవిష్యత్ వరంగల్ నగరాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో మురుగునీటి సేకరణ, పైప్‌లైన్లు, సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు తదితర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్న భారీ ప్రాజెక్టు. 2026, మార్చి 10న వరంగల్ నగరాభివృద్ధిపై హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో మంత్రి పొంగులేటి, అప్పటి మంత్రి కొండా సురేఖలు ఎమ్మెల్యేలు, అధికారులతో యూజీడీపై చర్చించారు. రూ.5,257 కోట్లతో చేపట్టే భూగర్భ డ్రెయినేజీ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ఏఫ్రిల్‌లో చేపట్టాలని ఆదేశించారు.
భూసేకరణకు ఉత్తర్వులు..
యూజీడీ కోసం ఇంకా టెండర్లు పిలవనప్పటికీ భూసేకరణకు విదివిధానాలను ఖరారు చేస్తూ ఆగస్టు 28న, బుధవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. భూసేకరణ, పునరావాస చట్టం – 2013 కింద సాధారణంగా చేపట్టాల్సిన సామాజిక ప్రభావ అంచనా (సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఎస్‌ఐఏ)) ప్రక్రియ నుంచి ఈ ప్రాజెక్టుకు ఉత్తర్వుల ద్వారా మినహాయింపు ఇచ్చింది. బొల్లికుంట, ఉర్సు, ఖిలా వరంగల్, దేశాయిపేట, పైడిపల్లి, హసన్‌పర్తి, కాజీపేట ప్రాంతాల్లో భూసేకరణ చేయాలని కూడా సూచించింది. టెండర్ల విషయమై జీడబ్ల్యూఎంసీ ఇంజనీరింగ్ అధికారి ఒకరు మాట్లాడుతూ డీపీసీ ఆమోదం తర్వాత టెండర్ల ప్రక్రియ పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్‌కు అప్పగించినట్లు చెప్పారు. ప్రజారోగ్యశాఖ అధికారులు మాత్రం టెండర్ల నిర్వహణకు కసరత్తు జరుగుతుందని, త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
జీడబ్ల్యూఎంసీలో యూజీడీ పనులకు ఎదురుచూపులు నిధులు ప్రకటించినా టెండర్ల దశ దాటని కసరత్తు
సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనకు రెండేళ్లు..
మంత్రి హామీకి ఏడాది
రూ.4,170 కోట్ల నుంచి
రూ.5,257.20 కోట్లకు ప్రాజెక్టు వ్యయం
వర్షాలు పడితే తప్పని మురుగు ముంపు


