సాక్షి, వరంగల్: వరంగల్ సమీపంలోని మామునూరులో ఎలక్ట్రిక్ బస్ డిపో ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. పశుసంవర్థక శాఖకు చెందిన సుమారు 10 ఎకరాల భూమిని డిపో కోసం వినియోగించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ, రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. భూముల బదలాయింపుపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద నిర్ణయం తీసుకుంటే, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యేక చొరవ చూపెడితే ఈ ప్రాజెక్టు త్వరితగతిన పట్టాలెక్కనుంది.
డిపో, విద్యుత్ మౌలిక వసతులకు నిధులు
కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2024 అక్టోబర్ 28న పీఎం ఈబస్ సేవా–పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం (పీఎస్‌ఎం) పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం పీఎం ఈ–బస్ సేవా పథకం కింద వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు, నిజామాబాద్‌కు 50 బస్సులు అర్హత కల్పించారు. 2025లో కేంద్రం ఇచ్చిన సమాచారంలో వరంగల్ ఈ పథకంలో పాల్గొనలేదని పేర్కొంది. తాజా కేంద్ర వివరాల్లో కూడా వరంగల్‌కు 100 బస్సుల కేటాయింపు ఉండడంతో మామునూరులో ప్రతిపాదిస్తున్న డిపోనకు ప్రాధాన్యం పెరుగుతోంది. అవసరమైన భూమి, విద్యుత్ కనెక్షన్, చార్జింగ్ వ్యవస్థ, పార్కింగ్, వర్క్‌షాపు, సిబ్బంది, సౌకర్యాలు సిద్ధమైతే ఈ–బస్సుల నిర్వహణకు అనువైన కేంద్రంగా మారే అవకాశం ఉంది.
విమానాశ్రయం, శివారు ప్రాంతాలకు లాభం
మామునూరు డిపోకు మరో ప్రత్యేకత విమానాశ్రయం, నగరానికి సమీపంలో ఉండడం కలిసిరానుంది. భవిష్యత్‌లో విమానాశ్రయం నుంచి వరంగల్ నగరంలోని ప్రధాన ప్రాంతాలకు ఈ–బస్ సర్వీసులు నడిపే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మామునూరు, వర్ధన్నపేట పరిసరాలు, నగర శివారు ప్రాంతాల ప్రజలకు నగరానికి చేరుకునే రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది.
పెరగనున్న ఉపాధి అవకాశాలు..
డిపో ఏర్పాటుతో డ్రైవర్లు, సాంకేతిక సిబ్బంది, చార్జింగ్ స్టేషన్ల నిర్వహణ, భద్రత, పారిశుద్ధ్యం, పరిపాలన, నిర్వహణ తదితర విభాగాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. చుట్టుపక్కల చిన్న వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మామునూరుకు రవాణా సౌకర్యం, వరంగల్‌కు పర్యావరణహిత ప్రజా రవాణా, యువతకు ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంది.
10 ఎకరాల్లో ప్రతిపాదన.. 100 ఎలక్ట్రిక్ బస్సులకు అవకాశం
చార్జింగ్ పాయింట్లు, మౌలిక వసతులు, వందల మందికి ఉపాధి
కలెక్టర్ సత్యశారద త్వరగా నిర్ణయం తీసుకుంటే మేలు


