మెస్‌ల నిర్వహణలో అక్రమాలపై సబ్‌కమిటీ | - | Sakshi
Sakshi News home page

మెస్‌ల నిర్వహణలో అక్రమాలపై సబ్‌కమిటీ

Aug 19 2026 12:42 AM | Updated on Aug 19 2026 12:42 AM

కేయూ క్యాంపస్‌: హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో మంగళవారం కేయూ పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. కేయూలోని హాస్టళ్ల మెస్‌ల నిర్వహణ, అడ్వాన్స్‌ల పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన రెండు కమిటీల నివేదికలను పరిశీలించారు. నివేదికలు, అవకతవకల ఆరోపణలపై విచారణ జరిపి మరో నివేదిక ఇచ్చేలా పాలకమండలి సమావేశం నిర్ణయించిందని సమాచారం. ఇందుకోసం కేయూ పాలకమండలి సభ్యులు పుల్లూరు సుధాకర్‌, డాక్టర్‌ అనితారెడ్డి, ప్రొఫెసర్‌ మల్లం నవీన్‌తో సబ్‌కమిటీని నియమించారు.

యంగ్‌ ఇండియా ఇంట్రిగ్రేటెడ్‌ స్కూల్‌కు

15 ఎకరాలు..

వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గానికి ప్రభుత్వం మంజూరు చేసిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి కేయూలోని కెనాల్‌ సమీపంలో ఉన్న 15 ఎకరాల భూమి కేటాయించాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. సమావేశం అనంతరం పలువురు పాలకమండలి సభ్యులు సెక్రటేరియట్‌లో ఉన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని కలిసి ఈవిషయాన్ని వివరించారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతి, సహకారం అందేలా కృషిచేయాలని ఎమ్మెల్యేను కోరారు.

ఎజెండాలో 40 అంశాలు..

నవంబర్‌లో నిర్వహించే కేయూ 24వ స్నాతకోత్సవానికి పాలకమండలి ఆమోదించింది. యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనులకు కూడా పాలకమండలి సమావేశంలో ఆమోదించినట్లు తెలిసింది. ఎజెండాలో మొత్తం 40 అంశాలను ప్రవేశపెట్టగా పలు అంశాలు డిపర్‌ అయ్యాయని సమాచారం. సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యోగితారాణా, ఫైనాన్స్‌ స్పెషల్‌ సెక్రటరీ సిక్తా పట్నాయక్‌, ఉన్నత విద్యాకమిషనర్‌ శ్రీదేవసేన, కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు బి.సురేశ్‌లాల్‌, పి.సుధాకర్‌, సుదర్శన్‌, రమ, చిర్ర రాజు, అనితారెడ్డి, బాలుచౌహాన్‌, మల్లం నవీన్‌,సుకుమారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement