డైట్ కాంట్రాక్టర్‌ను తొలగించాలి: సీపీఎం
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న భోజనం నాసిరకంగా ఉందని, వెంటనే డైట్ కాంట్రాక్టర్‌ను తొలగించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పార్టీ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆస్పత్రి సమస్యలపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. ఈసందర్భంగా వారు చికిత్స పొందుతున్న రోగులు, వారి అటెండెంట్లతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భోజనం నాసిరకంగా ఉందని, అన్నం సరిగ్గా ఉడక్కపోవడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు రోగులు వారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై నాయకులు.. సంబంధిత కాంట్రాక్టర్‌ను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వారు పేర్కొన్నారు. డయాలసిస్ రోగులకు అవసరమైన కిట్లు, మందులివ్వకుండా, బయట కొనాలని వైద్యులు చెబుతున్నట్లు సీపీఎం నాయకులకు రోగులు విన్నవించారు. దీనివల్ల ప్రతీవారం రోగులపై అదనపు ఖర్చు కావడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నాయకుడు సింగారపు బాబు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అరుణ్‌కుమార్, ఎండీ.మహబూబ్ పాషా, ఎన్.చంద్రమౌళి, సింగారం చుక్కయ్య, రాజమణి, అనిల్, శివ పాల్గొన్నారు.


