హన్మకొండ అర్బన్ : జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ సర్వేను వేగంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో భూములు, కొలతల శాఖ అధికారులు, సర్వేయర్లు, లైసెన్స్డ్ సర్వేయర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. జిల్లాలో రీ సర్వే పనులు వేగంగా సాగుతున్నాయని, సర్వేయర్ల పనితీరు సంతృప్తికరంగా ఉందని అభినందించారు. సమావేశంలో భూములు కొలతల శాఖ ఏడీ నూర్ సింగ్, డీఐలు సారంగపాణి, రాజనర్సయ్య, సర్వేయర్లు, లైసెన్స్డ్ సర్వేయర్లు పాల్గొన్నారు.
భూభారతి పోర్టల్‌పై అవగాహన ఉండాలి..
భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ మాడ్యూళ్లపై జూనియర్ అసిస్టెంట్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన భూభారతి పోర్టల్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ ఏఓ నాగరాజు, రెవెన్యూ అధికారులు, జిల్లాలోని 14 మండలాలకు చెందిన జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలి
ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిల్లో సమర్థవంతంగా నిర్వహించాలని హనుమకొండ ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో మండల స్థాయి ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. మండల స్థాయి ప్రజావాణి ఏర్పాటు, నిర్వహణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.


