ఆర్టీసీలో డివిజన్ల కుదింపు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో డివిజన్ల కుదింపు

Mar 13 2026 9:03 AM | Updated on Mar 13 2026 9:03 AM

డివిజన్లలో అభివృద్ధి పనులు

20 ఏళ్లుగా

ఇంజనీర్ల రిక్రూట్‌మెంట్‌ నిల్‌

హన్మకొండ: టీజీఎస్‌ ఆర్టీసీలో సివిల్‌ విభాగం డివిజన్‌ కార్యాలయాలు పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. పునర్వ్యవస్థీకరణ పేరుతో డివిజన్‌ కార్యాలయాలను కుదించేందుకు ఆర్టీసీ యాజమాన్యం పూనుకుంది. 20 ఏళ్లుగా సివిల్‌ విభాగంలో ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ చేపట్టకపోవడంతో ఉన్నతస్థాయి పోస్టులు మినహా మిగతా అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇంజనీరింగ్‌ పోస్టులు భర్తీ చేసేందుకు రిక్రూట్‌మెంట్‌ చేపట్టాల్సి ఉండగా సివిల్‌ విభాగాన్ని కుదించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా నిరసన, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సివిల్‌ విభాగం అభివృద్ధి పనులు పర్యవేక్షించే వారు లేకపోగా, డివిజన్లను కుదించడం ద్వారా పర్యవేక్షణ కొరవడుతుందని, అభివృద్ధి పనులు కుంటుపడుతాయని పరిశీలకులు పేర్కొంటున్నారు.

ఈఈగా 6 డివిజన్‌ కార్యాలయాలు..

టీజీఎస్‌ ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా బస్‌భవన్‌లోని కార్యాలయం కాకుండా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఉన్నతాధికారిగా 6 డివిజన్‌ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో రీజియన్‌ కార్యాలయాలు కేంద్రంగా డిప్యూటీ ఇంజనీర్లు అధికారిగా సబ్‌ డివిజన్‌ కార్యాలయాలున్నాయి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనుల నిర్వహణ, పర్యవేక్షణకు అసిస్టెంట్‌ ఇంజనీర్లు ఉంటారు. రాష్ట్రస్థాయిలో చీఫ్‌ సివిల్‌ ఇంజనీర్‌ ఉంటారు. వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ రూరల్‌, హైదరాబాద్‌ అర్బన్‌, సికిందాబాద్‌, హైదరాబాద్‌ హెడ్‌క్వార్టర్‌ డివిజన్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇందులో వరంగల్‌, హైదరాబాద్‌ అర్బన్‌ డివిజన్‌ కార్యాలయాలను ఎత్తివేయడానికి రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

వరంగల్‌ సివిల్‌ డివిజన్‌లో రెండు రీజియన్లు..

వరంగల్‌ సివిల్‌ డివిజన్‌ పరిధిలో ప్రస్తుతం నల్ల గొండ, వరంగల్‌, ఖమ్మం రీజియన్లున్నాయి. హైదరాబాద్‌ అర్బన్‌ సివిల్‌ డివిజన్‌ పరిధిలో సిటీ డిపోలున్నాయి. వరంగల్‌ సివిల్‌ డివిజన్‌ను కరీంనగర్‌ డివిజన్‌లో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో వరంగల్‌ డివిజన్‌ పరిధిలోని వరంగల్‌, ఖమ్మం రీజియన్‌ను కరీంనగర్‌ సివిల్‌ డివిజన్‌ పరిధిలోకి విలీనం చేయనున్నారు. నల్లగొండ రీజియన్‌ను హైదరాబాద్‌ జోన్‌ డివిజన్‌ కార్యాలయంలో విలీనం చేయనున్నారు. విలీనం అనంతరం హైదరాబాద్‌ జోన్‌ సివిల్‌ డివిజన్‌ పరిధిలో నల్లగొండతో పాటు మహబూబ్‌నగర్‌, మెదక్‌, రంగారెడ్డి రీజియన్లు ఉండనున్నాయి. కరీంనగర్‌ సివిల్‌ డివిజన్‌ పరిధిలో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం రీజియన్లు ఉండనున్నాయి.

ఒక్క ఈఈకి నాలుగైదు రీజియన్ల బాధ్యతలు..

ఈక్రమంలో ఈఈలకు పర్యవేక్షణ కష్టతరం కానుంది. ఒక్క ఈఈ నాలుగైదు రీజియన్లను పర్యవేక్షించడం అంత సులువు కాదు. కరీంనగర్‌లో ఉంటూ ఖమ్మం, ఆదిలాబాద్‌ వంటి సుదూర ప్రాంతాల్లోని డిపోల పరిధిలో జరిగే అభివృద్ధ పనులు పర్యవేక్షించడం ఆషామాషీ కాదని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే అన్ని రీజియన్లలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో డీఈఈలు చేయాల్సిన పర్యవేక్షణ కూడా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు (ఈఈ)లు చేయాల్సి వస్తోంది. దీంతో పాటు కార్యాలయం పనులు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అభివృద్ది పనుల పర్యవేక్షణ కొరవడనుంది.

మాయంకానున్న వరంగల్‌, హైదరాబాద్‌ అర్బన్‌ డివిజన్లు

కొరవడనున్న పర్యవేక్షణ.. అభివృద్ధి పనులు మరింత ఆలస్యం

20 ఏళ్లుగా చేపట్టని సివిల్‌ ఇంజనీర్ల నియామకాలు

ఏళ్లుగా డిప్యూటీ ఇంజనీర్లు, ఏఈల పోస్టులు ఖాళీ

వరంగల్‌ రీజియన్‌లో రూ.5.91 కోట్లతో ఏటూరునాగారంలో బస్‌ డిపో నిర్మాణం, రూ.4.8 కోట్లతో ములుగు బస్‌స్టేషన్‌, రూ.51 లక్షలతో మంగపేట బస్‌ స్టేషన్‌ నిర్మాణం, ఖమ్మం రీజియన్‌లో రూ.9.41 కోట్లతో మధిర బస్‌ స్టేషన్‌ నిర్మాణం, నల్ల గొండ రీజియన్‌లో రూ.17 కోట్లతో కోదాడలో బస్‌ స్టేషన్‌, రూ.3.53 కోట్లతో హుజుర్‌నగర్‌లో బస్‌ స్టేషన్‌ నిర్మాణ వంటి మేజర్‌ పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఇతర సివిల్‌ అభివృద్ధి పనులు సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆయా డివిజన్లలో రూ.కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు సాగుతున్నాయి. డివిజన్ల కుదింపు, డీఈల కొరతతో పర్యవేక్షణ లేక పనులు కుంటుపడే అవకాశముంది.

టీజీఎస్‌ ఆర్టీసీలో 20 ఏళ్లుగా సివిల్‌ విభాగంలో ఇంజనీర్ల రిక్రూట్‌మెంట్‌ చేపట్టలేదు. దీంతో ఖాళీగా ఉన్నా ఏఈ పోస్టుల్లో కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగుల్లో సివిల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ డిప్లొమా, సివిల్‌ ఐటీఐ చేసిన వారిని అదనపు డ్యూటీల్లో భాగంగా ఏఈ పనులు చూసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఏఈలుగా ఔట్‌సోర్సింగ్‌ ద్వారా దాదాపు 37 మంది, సంస్థకు చెందిన 20 మంది ఓడీగా ఏఈలుగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ అర్బన్‌–1, హైదరాబాద్‌ అర్బన్‌–2, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం, సికింద్రాబాద్‌–1 డీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటు డీఈ పీ అండ్‌ డీ ఈనెల రిటైర్డ్‌ కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement