సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒకటే శిశుగృహ ఉండడంతో దత్తతలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏ జిల్లాకు చెందిన శిశుగృహ ఆ జిల్లాలోనే ఉంటే ఇలాంటి సమస్యలు రావని అందరు సమన్వయంతో ముందుకెళ్లవచ్చని హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు. ‘సమన్వయ లోపం.. శిశువులకు పాపం’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అక్రమ దత్తత కేసులు తొందరగా పరిష్కారమైతే ఐదుగురు శిశువుల దత్తత ప్రక్రియ త్వరగా ముగుస్తుందన్నారు. శిశువుల దత్తతలో ఆలస్యమవడానికి గల కారణాలను లోతుగా పరిశీలించి జిల్లా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. హనుమకొండలోని శిశుగృహలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 13 మంది శిశువులు ఉంటే 10 మంది అక్రమ దత్తత, డీఎన్‌ఏ పెండింగ్, కిడ్నాప్ కేసుల వల్ల దత్తత వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. దీంతో నాలుగు గోడల మధ్యే ఉండాల్సిన పరిస్థితి ఉందని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
హనుమకొండ జిల్లా సంక్షేమ
అధికారి భాగ్యలక్ష్మి


