● వ్యక్తి అరెస్ట్, రిమాండ్
● వివరాలు వెల్లడించిన ఏసీపీ సతీశ్ బాబు
శాయంపేట : చిట్టీల పేరుతో మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పరకాల ఏసీపీ సతీశ్ బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం శాయంపేట పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన పెరుమాండ్ల కిశోర్ రెడ్డి పెరుమాండ్ల చిట్‌ఫండ్ పేరుతో 117 మంది వద్ద రూ. 1.49 కోట్లు, మరో 59 మంది వద్ద రూ.3.55 కోట్లు అప్పు తీసుకొని మొత్తం 176 మందిని మోసం చేశాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యా దు మేరకు పోలీసులు కిశోర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్ట్ చేసి అతడి వద్ద వద్ద ఉన్న రూ. 25.39లక్షల నగదు, 12 ప్లాట్లు, వ్యవసాయ భూముల పత్రాలు, బంగారం, వెండి ఆభరణాలు, ఓ కారుతో సహా మొత్తం రూ. 8.12 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, కేసు వేగంగా చేధించిన సీఐ రంజిత్ రావు, ఎస్సై జక్కుల పరమేశ్‌తోపాటు సిబ్బందిని ఈస్ట్ జోన్ డీసీసీ అంకిత్ కుమార్, ఏసీపీ సతీశ్ బాబు అభినందించారు.


