ఖానాపురం: దుర్గమ్మ పండుగలో అపశ్రుతి చోటుచేసకున్న సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై రఘుపతి, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకమ్మనగర్ పరిధిలోని గోవిందుతండాలో తండావాసులు దుర్గమ్మ పండగను జరుపుకున్నారు. సాయంత్రం సమయంలో సభావత్ భిక్షపతి ఇంటి ఆవరణలో కొందరు తండావాసులు బోనాలు ఎత్తుకుని నృత్యం చేశారు. ఈసమయంలో ఓ ట్రాన్స్‌జెండర్ బాటిల్‌లో పెట్రోల్ నింపుకుని సర్కిల్‌గా అక్కడ పోసింది. పోసిన పెట్రోల్‌కు నిప్పు అంటించే క్రమంలో బాటిల్, సర్కిల్‌గా పోసిన చోట మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన ట్రాన్స్‌జెండర్ మంటలు అంటుకున్న బాటిల్‌ను విసిరేసింది. అక్కడే ఉన్న బాదావత్ బుజ్జి, నున్సావత్ దేవేందర్, బోడ పూల్య, దేవమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్న తండాకు చెందిన నరేశ్, చందు, గణేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ట్రాన్స్‌జెండర్‌తో పాటు మరికొంత మందికి గాయాలైనట్లు తెలిసింది. ప్రమాదానికి కారణమైన ట్రాన్స్‌జెండర్ అక్కడి నుంచి పరారీ అయినట్లు సమాచారం. గాయపడిన తండావాసులను స్థానికులు నర్సంపేటలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై రఘుపతి సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్‌కు తరలించారు. కాగా, తండాలో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.
పెట్రోల్ అంటుకుని పలువురికి గాయాలు
చిలుకమ్మనగర్ గోవిందుతండాలో ఘటన
వివరాలు సేకరించిన ఎస్సై రఘుపతి


