పరిష్కారం చూపరా? | - | Sakshi
Sakshi News home page

పరిష్కారం చూపరా?

Mar 11 2026 8:58 AM | Updated on Mar 11 2026 8:58 AM

పరిష్కారం చూపరా?

వరంగల్‌ అర్బన్‌: గ్రీవెన్స్‌ సెల్‌లో అందించిన ఫిర్యాదులకు పరిష్కారం చూపరా? అంటూ పలు కాలనీలవాసులు గ్రేటర్‌ వరంగల్‌ అధికారులను నిలదీశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్‌ హాల్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌లో అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా పలు కాలనీల ప్రజలు వినతి పత్రాలు అందించే క్రమంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసిన ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడతామని, వివాద రహిత అంశాలపై విచారించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రీవెన్స్‌ సెల్‌కు మొత్తం 53 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్‌ ప్లానింగ్‌కు 21, ఇంజనీరింగ్‌ సెక్షన్‌కు 16, రెవెన్యూ విభాగానికి 4, ప్రజారోగ్యానికి 7, నీ టి సరఫరాకు 4, ఉద్యాన వన విభాగానికి 1 ఫిర్యాదులు అందినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌ రవీందర్‌ వాడేకర్‌, ఏసీపీలు, డీఈలు పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌ వెలవెల

బల్దియా గ్రీవెన్స్‌ సెల్‌ అధికారులు, ఉద్యోగులు లేక వెలవెలబోయింది. బల్దియా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఇటీవల హనుమకొండ కలెక్టర్‌గా పదోన్నతిపై బదిలీ కాగా, ఆమె స్థానంలో ఎవరినీ నియామించక ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. కమిషనర్‌ గ్రీవెన్స్‌సెల్‌కు హాజరు కాకపోవడంతో 50 శాతం మందికిపైగా అధికారులు, ఉద్యోగులు గ్రీవెన్స్‌ సెల్‌కు డుమ్మా కొట్టారు. కొందరు దూరంగా ఉండగా, మరికొందరు కార్యక్రమం జరుగుతున్న క్రమంలో జారుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఫిర్యాదుల్లో కొన్ని..

● 27వ డివిజన్‌లో 2024–25 జనరల్‌ ఫండ్‌ ద్వారా వివిధ పనులు మంజూరు చేసినట్లు టెండర్లు జరిగి ఏడాదైనా పనులు మొదలు పెట్టలేదని, వెంటనే ప్రారంభించాలని కార్పొరేటర్‌ చింతాకుల అనిల్‌ కోరారు.

● 38వ డివిజన్‌ నలింగంటి వాడలో వాటర్‌ పైప్‌ లైన్‌ మీద, సీసీ రోడ్డు మెట్లు కట్టారని చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.

● 3వ డివిజన్‌ పైడిపల్లి లక్ష్మీగణపతి కాలనీలో తాగునీటి పైపులైన్లు నిర్మించి, కనెక్షన్లు ఇవ్వాలని కాలనీ కమిటీ ప్రతినిధులు విన్నవించారు.

● హనుమకొండ కంచరకుంట 6–1–120 ప్రాంతంలో ‘కూడా’ ప్లాట్లలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి ముంపునకు గురువుతోందని నూతనంగా నిర్మించాలని కాలనీ వాసులు వినతి పత్రం అందించారు.

● 66వ డివిజన్‌లోని ఎంప్లాయీస్‌ కాలనీ సర్వే నంబరు 168లో పార్కు స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు అందించారు.

● హనుమకొండ ప్రకాశ్‌ రెడ్డి పేట మైత్రి వనం కాలనీలో రోడ్డు వెడల్పు చేసి, డ్రెయినేజీని విస్తరించాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

● వడ్డేపల్లి సూర్యప్రకాశ్‌ రెసిడెన్సీ కాలనీలో డ్రెయినేజీ నిర్మించాలని ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు.

● కడిపికొండ రాజీవ్‌ గృహ కల్పన కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు విన్నవించారు.

అధికారుల్ని నిలదీసిన

కాలనీల ప్రజలు

గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌ సెల్‌కు

53 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement