సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఈ యాసంగిలోనూ రైతులు వరి సాగువైపే మొగ్గు చూపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సీజన్‌లో వరిసాగు గతంతో పోలిస్తే కొంత మేర పెరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనాలు సూచిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మొత్తం సుమారు 6.35 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు ప్రాథమిక అంచనా. గత యాసంగిలో ఇది 5.98 లక్షల ఎకరాల వరకు మాత్రమే నమోదైంది. దీంతో ఈసారి దాదాపు 37 వేల ఎకరాలకు పైగా పెరుగుదల కనిపించింది.
యాసంగి సాగు ఇలా...
గతంతో పోలిస్తే ఈ యాసంగిలో వరిసాగు పదిశాతం మేర తగ్గుతుందని వ్యవసాయశాఖ అధికారులు మొదట అంచనా వేశారు. ఈ మేరకు ఈ సీజన్‌లో మొత్తం సాగు విస్తీర్ణం 9,12,880 ఎకరాలని అంచనా వేసిన అధికారులు 5.75 లక్షల ఎకరాల్లో వరి పంటలకు అవకాశం ఉందన్నారు. అందుకు భిన్నంగా మొత్తం పంటలు 9,82,880 ఎకరాల్లో వేయగా, 6,34,579 (64.56 శాతం) ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. మొక్కజొన్న, ఇతర పంటలన్నీ కలిపితే 35.44 శాతంగా నమోదయ్యాయి. ఈ లెక్కన గతంతో పోలిస్తే 37 వేల పైచిలుకు ఎకరాల్లో ఈసారి వరి సాగు కాగా, ఈసారి కూడా వరిసాగులో ఉమ్మడి వరంగల్‌ది రికార్డేనని వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఒకరు పేర్కొన్నారు. సాగునీటి లభ్యత, సాగు సౌకర్యాలు మెరుగుపడడం, ప్రభుత్వం వరి కొనుగోలుపై హామీ ఇవ్వడం, సన్నరకం మీద బోనస్ ఇవ్వడం వంటి కారణాలతో రైతులు ఇతర పంటల కంటే వరి సాగును ఎక్కువగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది
తొమ్మిదెకరాల్లో వరి వేసిన..
నాకున్న ఆరు ఎకరాలకు తోడు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఇందులో మూడెకరాలు సన్నాలు, మరో మూడెకరాలు దొడ్డు రకం, ఇంకో మూడెకరాలు సీడ్ వరి వేసిన. వరి పంటకు మంచి డిమాండ్ ఉండడంతో పాటు మద్దతు ధర కూడా వస్తుండడంతో మొత్తానికి మొత్తం వరి వేసిన.
– ఎండపెల్లి తిరుపతిరెడ్డి, రైతు, కమలాపూర్
యాసంగిలో మళ్లీ వరిసాగు వైపు ఉమ్మడి జిల్లా రైతుల మొగ్గు
మొత్తం విస్తీర్ణంలో 64.56 శాతం
వరి నమోదు
మిగతా పంటలతో పోలిస్తే
మేలంటున్న రైతులు
జిల్లా మొత్తం పంటలు వరి
వరంగల్ 1,96,722 95,152
హనుమకొండ 1,77,735 1,11,380
జనగామ 2,07,353 1,79,010
మహబూబాబాద్ 2,13,665 1,07,617
జెఎస్ భూపాలపల్లి 1,17,085 89,000
ములుగు 70,320 52,420
మొత్తం 9,82,880 6,34,579


