● మరో
ఆరుగురికి కూడా..
● ఓవెన్ బ్యాగ్ తయారీ వ్యాపారంలో రాణింపు
● ప్రస్తుతం ఏడాదికి రూ. కోటిన్నర టర్నోవర్
● మహిళా సంఘాల లోన్లతో స్వయం ఉపాధి
శాయంపేట : ఆమె ఓ డ్వాక్రా సంఘంలో సాధారణ సభ్యురాలు. మండల సమాఖ్య తరఫున లోన్ తీసుకుని నానో ఓవెన్ బ్యాగ్ తయారీ పరిశ్రమ ఏర్పా టు చేశారు. తాను స్వయం ఉపాధి పొందడంతో పాటు మరో ఆరుగురికి ఉపాధి చూపించారు. కొద్ది కాలంలోనే రూ. కోటిన్నర టర్నోవర్ సాధించారు. ఫలితంగా మహిళా పారిశ్రామిక వేత్తగా ఎదిగి ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన దాసరి కల్పన. నేడు అంతర్జాతీయ మహిళాదినోత్సవం. ఈ సందర్భంగా కల్పన విజయ గాథపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
2001లో డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా చేరిక
ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న కల్పనకు భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ క్రమంలో కల్పన.. సరస్వతి డ్వాక్రా సంఘంలో 2001లో సభ్యురాలిగా చేరారు. కుట్టు మిషన్ ద్వారా జాకెట్లు కుడుతూ ఉపాధి పొందేవారు. ఈ నేపథ్యలో ఉమ్మడి జిల్లా తరఫున సీఆర్పీ ట్రైనింగ్‌కు ఎంపికయ్యారు. సీఆర్పీగా ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు వెళ్లి పని చేశారు.
2020లో నానో ఓవెన్ బ్యాగ్ తయారీ పరిశ్రమ ఏర్పాటు
కల్పన.. శాయంపేట మండల సమాఖ్య తరఫున రూ. 15 లక్షల లోన్ తీసుకుని శాయంపేటలోనే 2020లో నాన్ ఓవెన్ బ్యాగ్ తయారీ పరిశ్రమ ప్రారంభించారు. సొంతంగా మరో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఏడాదికి రూ.కోటిన్నర టర్నోవర్ సాధించారు.
కుట్టు మిషన్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నా. నా ఇద్దరు కూతుళ్లను ఒంటరిగా వదిలేసి సీఆర్పీగా పని చేయడానికి పొరుగు రాష్ట్రాలకు వెళ్లా. ఈక్రమంలో ‘లక్‌పతి దిది’ కార్యక్రమం ద్వారా నాకు గొప్ప అవకాశం దక్కింది. నానో ఓవెన్ బ్యాగ్ పరిశ్రమ స్థాపించా. ఈ పరిశ్రమ నడపడంలో నా భర్త సహకారం మరువలేనిది.
– దాసరి కల్పన, మహిళాపారిశ్రామికవేత్త, శాయంపేట


