హసన్‌పర్తి: నూతన సాంకేతికతను ఆస్వాదించాలని దర్శకుడు, కిట్స్ కళాశాల పూర్వ విద్యార్థి ప్రశాంత్ ఆర్.విహారి అన్నారు. కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న స్టూడెంట్ కల్చరల్ కార్నివాల్ ‘సంస్కృతి– 26’ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రశాంత్ విహారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి వేడుకలు దోహదపడుతాయన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న అసంబద్ధమైన అంశాలకు అలవాటు పడొద్దని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కిట్స్ కళాశాల అదనపు కార్యదర్శి సతీష్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నాయకత్వపు లక్షణాలు పెంపొందించడానికి వేడుకలు ఉపకరిస్తాయని తెలిపారు. విద్యార్థులు సానుకూల దృక్ఫథాన్ని అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్‌రెడ్డి, కళాశాల యాజమాన్య వర్గ సభ్యుడు వెంకట్రామ్‌రెడ్డి, ప్రోగ్రాం చైర్‌పర్సన్ ప్రొఫెసర్ శ్రీధర్, కన్వీనర్ డాక్టర్ పీఎస్‌ఎస్ మూర్తి, డాక్టర్ శిరీష, డాక్టర్ ప్రభాకరాచారి, విద్యార్థి ఐటీ విభాగం అధ్యక్షురాలు సంహిత, ఉపాధ్యక్షురాలు శ్రీలాస్య విద్యార్థి విభాగం ప్రతినిధులు సాయి సుమంత్, సాయి ధనుష్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా..కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రదీప్ డీజీ బ్యాండ్ ఆకట్టుకుంది.
దర్శకుడు ప్రశాంత్ ఆర్.విహారి
కిట్స్‌లో ప్రారంభమైన సంస్కృతి –26 వేడుకలు


