కేయూ క్యాంపస్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో సవాళ్లకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకుంటూ నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం క్యాంపస్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన రూబిజెస్ట్–26 టెక్నికల్ ఫెస్టివల్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భిక్షాలు అధ్యక్షత వహించగా రామచంద్రం మాట్లాడారు. సమస్య పరిష్కార నైపుణ్యం, విమర్శనాత్మక ఆలోచనలే ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలకు మూలమన్నారు. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో విద్యార్థినులు అవకాశాలు అందిపుచ్చుకోవడం అభినందనీయమన్నారు. నిట్ ప్రొఫెసర్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదువుతూ ఆశాభావంతో ముందుకెళ్తే భవిష్యత్‌లో ఉన్నతస్థితికి చేరుకోవచ్చన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ భిక్షాలు, స్టూడెంట్స్ అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ అర్చన, కన్వీనర్ డాక్టర్ సురేందర్, మహిళా ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, స్టూడెంట్ కోఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు, ఇతర కాలేజీల విద్యార్థులు టెక్నికల్ ఈవెంట్స్‌ను ప్రదర్శించారు. వివిధ బ్రాంచీలకు సంబంధించి కోడ్ రైటింగ్, లాజికల్ ఫజిల్స్, క్లూస్‌కోడ్, ప్రాజెక్ట్ ఎక్స్‌పో, వివిధ పోస్టర్ల ప్రజెంటేషన్స్ చేశారు. విద్యార్థినుల సాంస్కృత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నేడు కల్చరల్‌ఫెస్ట్‌తో కార్యక్రమం ముగియనుంది.
కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం
ఆడిటోరియంలో రూబిజెస్ట్–26 టెక్నికల్ ఫెస్టివల్


