హన్మకొండ: సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై బీఆర్‌ఎస్ పోరాడుతుంటే 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని తూర్పారబట్టారు. వెలుగుమట్లలో రెండు వేల పేద కుటుంబాల ఇళ్లను కూల్చి రోడ్డుపై పడేశారని మండిపడ్డారు. నాలుగు వేల మంది పోలీసులతో వెలుగుమట్లను గాజాగా మార్చారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో రూ.300 కోట్ల విలువైన భూమిని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు కబ్జా చేస్తే గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేస్తే సీఐని బదిలీ చేయించారన్నారు. మేడారంలో నాసిరకం పనులు చేస్తూ దోచుకుంటున్నారని, భూభారతి పేరుతో రూ.వందల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. దీనికి బాధ్యుడిగా మంత్రి పదవికి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాయకులు ఇమ్మడి రాజు, జన్ను జకర్య, గబ్బెట శ్రీను, మంద శ్యాం, జంపన్న, చక్రి, సదాంత్, పూర్ణచందర్, ప్రశాంత్, మనోజ్ కుమార్ పాల్గొన్నారు.


