హన్మకొండ కల్చరల్: ఫాల్గుణమాసం కామునిపున్నమిని పురస్కరించుకుని మంగళ, బుధవారం హోలీ సంబురాలు జరుపుకోనున్నారు. సోమవారం సా యంత్రం 5.55గంటలకు పౌర్ణమి ప్రా రంభమై మంగళవారం సాయంత్రం 5.07గంటలకు ముగుస్తుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ప్రజ లు ప్రధాన వీధుల ముఖ్య కూడలిలో కామదహనం ఘనంగా జరుపుకున్నారు. అంతకు ముందు పాత కర్ర పెట్టి నీళ్లు ఆరబోసి కామదాహన వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వారంరోజులుగా జాజిరి ఆడిన పిల్లలు తమ కోలలను కామదహనంలో పడేశారు. మహిళలు కామదహనం చుట్టూ నీళ్లు పోస్తూ గుడాలు చల్లుతూ ఆరగింపు చేశారు. కొన్ని చోట్ల మంటచుట్టూ పాటలు పాడారు.
హోలీ పండుగ.. సందిగ్ధం
మంగళవారం చంద్రగ్రహణం సంభవిస్తున్న నేపథ్యంలో హోలీ పండుగను ఎప్పుడు జరుపుకోవాలని ప్రజల్లో సందిగ్ధం ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణానికి ఆరుగంటల ముందు గ్రహవేద, గ్రహణం అనంతరం ఆరుగంటల వరకు గ్రహణశూల ఉంటుంది. అందుకే హోలీ పండుగ, పూజా కార్యక్రమాలను బుధవారం జరుపుకోవడం ఉత్తమమని తెలంగాణ అర్చక సమాఖ్య జాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, కొందరు వేదపండితులు మంగళవారం మధ్యాహ్నం 12గంటల లోపు నిర్వహించుకోవచ్చని చెప్పడంతోపాటు ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో కొందరు నేడు హోలీ పండుగను జరుపుకోనున్నారు. ఈ మేరకు సోమవారం నగరంలోని పలు కూడళ్లలో వివిధ రంగులు, వాటర్ కలర్ గన్స్, బిస్కెట్లు, చిలకలు, చాక్లెట్ల దండలు, షుగర్ క్యాండీలు విక్రయించే దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా కన్పించాయి.
రజకవీధిలో కామదహనం..
హనుమకొండ రాగన్నదర్వాజ రజకవీధిలో కామదహనం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చీకటి ఆనంద్, వీరస్వామి, నాగ సోమేశ్వర్, చందుపట్ల ధనరాజ్, చీకటి అశోక్, చీకటి రాజు, క్షను, సురేశ్, ఉపేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.


