వాహన కాంతితోనే ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

వాహన కాంతితోనే ప్రమాదాలు

Mar 2 2026 8:57 AM | Updated on Mar 2 2026 8:57 AM

వాహన కాంతితోనే ప్రమాదాలు

వాహన కాంతితోనే ప్రమాదాలు

ఖిలా వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని జాతీయ రహదారులపై రాత్రివేళ హెడ్‌లైట్లతోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటితో వచ్చే కాంతితో ఎదురుగా వచ్చే వాహనదారులకు రోడ్డు కనిపించక ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని ఆర్టీఏ, పోలీసు అధి కారులు గుర్తించారు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి సుమారు 9లక్షల 50 వేల వరకు ఉన్నాయి. ఆర్టీఏ కార్యాలయాలు ఆరు ఉన్నాయి.

కనిపించని నిషేధం..

రహదారులపై వాహనదారులు హైబీమ్‌ లైట్లను నిరంతరం వాడితే ఎదురుగా వచ్చే వాహనదారుల కంటి చూపు తాత్కాలికంగా దెబ్బతిని, రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది. నగరాలు, పట్టణాలు, వెలుతురు ఎక్కువగా ఉన్న రోడ్లపై లోబీమ్‌ వాడాలి. కానీ, అవగాహన లోపంతోనే హైబీమ్‌ వాడుతున్నారు. వీటి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలామంది వాహనదారులు వాపోతున్నారు. ఇది చట్టరీత్యా నేరమని తెలిసినా లారీలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు సైతం ఎల్‌ఈడీ, హైబీమ్‌ లైట్లు వాడడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈసమస్య ఏ ఒక్కరిదే కాదు.. రాత్రి రోడ్డుపై వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నారు.

కనిపించని బ్లాక్‌ స్టిక్కర్‌..

వాహనం ఏదైనా హెడ్‌లైట్లపై సగం వరకు బ్లాక్‌స్టిక్కర్‌ ఉండాలన్నా నిబంధన ఉండేది. ఆ రూల్‌ ఉందా.. తీసేశారో తెలియదు. వాహనాల హెడ్‌లైట్లకు వస్తున్న లీడ్‌ లైట్ల గురించి చర్యలు తీసుకోవడంతోపాటు హెడ్‌లైట్లకు సగం వరకు బ్లాక్‌ స్టిక్కర్‌ లేదా బ్లాక్‌ పెయింట్‌ వేయాలనే నిబంధన పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా..

గరిష్టంగా 70 వాట్లు మించిన ఫోకస్‌ లైట్లు వాడకూడదని నిబంధనలు ఉన్నాయి. ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలు, ప్రభుత్వ వాహనాలు అత్యధికంగా వెలుగులు ఇచ్చే హైబీమ్‌ లైట్లను వాడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి ఎదురుగా వచ్చే వాహనదారులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. హైబీమ్‌, ఎల్‌ఈడీ లైట్లు వాడితే ఆర్టీఏ చట్ట ప్రకారం రూ.500 నుంచి రూ.1,500 వరకు జరిమానా విఽధించాలని సుప్రీంకోర్టు సూచనలు ఉన్నా.. ఆర్టీఏ అధికారులు, పోలీసులకు పట్టడం లేదన్న ఆరోపణలున్నాయి.

ఏప్రిల్‌ నుంచి దేశవ్యాప్తంగా

హెడ్‌లైట్ల నిషేధం

వాహన చట్టం ప్రకారం సాధారణ లైట్లు వాడాలి

హైబీమ్‌ ఎల్‌ఈడీ లైట్లు వాడితే

జరిమానా

రాత్రివేళ నరకమే..

నగరాలు, పట్టణాలు, జాతీయ రహదారులపై రాత్రి 7 గంటల దాటితే వాహనాలు నడపాలంటే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఎదురుగా వాహనాల ఎల్‌ఈడీ లైట్లతో కళ్లు కనిపించకుండా మసకబారిపోతున్నాయని చెబుతున్నారు. కొత్తగా వచ్చే వాహనాలు ఎల్‌ఈడీ లైట్లతో రోడ్డు ఎక్కుతున్నాయి. వీటిపై ఆర్టీఏ, పోలీస్‌ అధికారుల పర్యవేక్షణ కరువడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement