హేమాచల క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం
● మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మంగపేట: మండలంలోని రెండో యాదగిరిగుట్టగా ప్రస్ధిగాంచిన మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి శ్రీనివాస్‌రెడ్డి దంపతులు, కుటుంబీకులు.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎంపీ పోరిక బలరాంనాయక్, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ హేమాచల క్షేత్రంలో స్వయంభుగా వెలసిన లక్ష్మీనర్సింహాస్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనకు అనుగుణంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని దేవాలయాలను టెంపుల్ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. వాటికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. మంత్రి సీతక్క కోరిక మేరకు ప్రభుత్వం హేమాచల క్షేత్రంతోపాటు ములుగు ప్రాంతంలోని ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తుందన్నారు. కాగా, ఆలయ కార్యనిర్వాహణ అధికారి రేవెల్లి మహేశ్ ఆధ్వర్యంలో అర్చకులు ముక్కామల శేఖర్‌శర్మ, రాజీవ్ నాగశర్మ, కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, వెంకటనారాయణ శర్మ.. మంత్రులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
ఉమాచంద్రశేఖరస్వామి
ఆలయంలో పూజలు..
మండల కేంద్రంలోని ఉమాచంద్రశేఖరస్వామి ఆలయాన్ని మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్లు, వెంకట్రావు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ నరేశ్‌రెడ్డి, పూజారి నరేశ్‌శర్మ ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కలెక్టర్ టీఎస్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, రాష్ట్ర ఉపాధి హామీ మండలి డైరెక్టర్ సోమయ్య, ములుగు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగకల్యాణి, తహసీల్దార్ రవీందర్, హేమాచల క్షేత్రం మాజీ చైర్మన్ సురేశ్, పురుషోత్తం, సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, మహిళా అధ్యక్షురాలు శానం నిర్మల, మంగపేట ఎఫ్‌ఎస్‌సీఎస్ మాజీ చైర్మన్ తోట రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


