నగరంలో కల్తీ పాల విక్రయాలే అధికం
హన్మకొండ చౌరస్తా: పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు హైడ్రోజన్ ఫెరాకై ్సడ్ లాంటి రసాయనాలు కలపడం, వెన్న శాతం 6.0గా ప్యాకెట్లపై చూపగా అందులో 5.5శాతం ఉన్నట్లుగా గుర్తించినట్లు వినియోగదారుల మండలి ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి తెలిపారు. వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో హనుమకొండలోని కుమార్‌పల్లి మార్కెట్ ఏరియాలో పాల కల్తీ – నాణ్యతపై ప్రజలకు ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మొబైల్ వాహనంలో ఉన్న ఆహార కల్తీ ప్రయోగశాలలో పలు కంపెనీలకు చెందిన పాల నాణ్యతను తనిఖీ చేశారు. నగరంలో అత్యధిక కంపెనీల పాలలో కల్తీ ఉన్నట్లు పరిశీలనతో తేలిందని చక్రపాణి అన్నారు. ఆహార భద్రత చట్టం, నిబంధనలకు సత్వరమే సవరణలు అవసరమని, వినియోగదారుల సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ జరిగిన రెండేళ్లు గడిచినా సవరణలు అమలు కావడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఆహార కల్తీ లాబొరేటరీలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లెపాడు దామోదర్, హనుమకొండ ఫుడ్ సేఫ్టీ అధికారి బ్రహ్మాజీ, సీసీఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్.రంజిత్‌కుమార్, మండలి రాష్ట్ర కార్యదర్శి ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


