గాదె ఇన్నయ్య ఇంట్లో మరో విషాదం..
● అనారోగ్యంతో తండ్రి సాల్మన్‌రెడ్డి మృతి
జఫర్‌గఢ్ : సామాజిక ఉద్యమకారుడు, మాఇల్లు అనాథ ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి థెరిసమ్మ మృతి చెందిన నెలన్నర రోజులకే తండ్రి సాల్మోన్‌రెడ్డి శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. మండలంలోని సాగరంలో ఉంటున్న సాల్మోన్‌రెడ్డి కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అలాగే, ఇటీవల తన భార్య థెరిసమ్మను కోల్పోవడం.. కుమారుడు జైలులో ఉండడంతో మానసికంగా కృంగిపోయాడు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. కాగా, మావోయిస్టులను ప్రోత్సహిస్తున్నారనే కారణంతో ఎన్‌ఐఏ డిసెంబర్ 21న ఇన్నయ్యను అరెస్ట్ చేసిన విషయం విధితమే. అప్పటి నుంచి ఇన్నయ్య హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. ఇటీవల తల్లి థెరిసమ్మ చనిపోవడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఇన్నయ్య రెండు సార్లు కండీషన్ బెయిల్‌పై వచ్చాడు. ఈ ఘటన జరిగి 43 రోజులు గడవక ముందే తండ్రి సాల్మోన్‌రెడ్డి కన్నుమూశాడు. దీంతో మళ్లీ తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కుటుంబీకులు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు.. ఇన్నయ్యకు రెండు రోజులు కండీషన్ బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఇన్నయ్య ఆదివారం స్వగ్రామం చేరుకోనున్నారు. రేపు లేదా ఎల్లుండి తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
గాదె ఇన్నయ్య ఇంట్లో మరో విషాదం..


