పురోగతి సాధనే వికసిత్ భారత్ లక్ష్యం
కేయూ క్యాంపస్: దేశంలో పేదరిక నిర్మూలన, ఆరోగ్యసేవల విస్తరణ, మహిళా సాధికారత, డిజిటల్ చేర్పువంటి కీలకరంగాల్లో పురోగతి సాధించటమే వికసిత్ భారత్ –2047 లక్ష్యంగా ఉండాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం అన్నారు. కేయూలో సోషల్ సైన్సెస్ విభాగాల ఆధ్వర్యంలో రెండురోజులుగా సెనెట్ హాల్‌లో నిర్వహిస్తున్న జాతీయ సదస్సు ముగింపు సభలో శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. డేటా ఆధారిత విధానాలు, రియల్‌టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు, గ్రీన్ ఎకనామీ, పునరుత్పాదక శక్తి వాతావరణ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య మనోహర్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ సాధన కేవలం ఆర్ధిక వృద్ధి మాత్రమే కాకుండా సమానత్వం, పర్యావరణ సమతుల్యత, సామాజిక న్యాయం, సాంకేతిక ప్రగతి సమన్వయంతో కూడిన సమగ్రాభివృద్ధి ఉండాలన్నారు. ఈ సభలో కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ఆచార్య మల్లికార్జున్‌రెడ్డి, సోషల్ సైన్స్ డీన్ ఆచార్య సురేష్‌లాల్, వివిధ విభాగాల అధిపతులు సంగాని మల్లేశ్వర్, రాధికారాణి, చిలువేరు రాజ్‌కుమార్, మామిడి లింగయ్య, సంకినేని వెంకట్, శ్రీనివాసులు, మేఘనరావు తదితరులు పాల్గొన్నారు.
11 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
● రూ.59,340 నగదు.. 11 సెల్‌ఫోన్లు స్వాధీనం
వరంగల్ క్రైం: హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుగా పేకాట ఆడుతున్న శిబిరంపై దాడులు నిర్వహించి 11మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదవనగర్‌లో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.59,340 నగదు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడినవారిలో మల్లారెడ్డిపల్లికి చెందిన అల్ల వెంకటేష్, పద్మాక్షిగుట్ట ప్రాంతానికి చెందిన బొంత రామకృష్ణ, రెడ్డిపాలేనికి చెందిన గట్ల రామాలింగారెడ్డి, హనుమన్‌నగర్‌కు చెందిన బానోతు రాజు, మధ్యకోటకు చెందిన మేకల రాజు, రంగశాయిపేటకు చెందిన వేములపల్లి అశోక్, రాంనగర్‌కు చెందిన బానోతు వర్మ, వంగపాడుకు చెందిన ముసుకు రాజశేఖర్, కొత్తవాడకు చెందిన వంగ విజేందర్, గుడిబండల్‌కు చెందిన ముసుకు ప్రవీణ్, వంగపహాడ్‌కు చెందిన సాధు ధనుంజయ్ ఉన్నట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం హనుమకొండ పోలీసులకు నిందితులను అప్పగించినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ దాడిలో ఇన్‌స్సెక్టర్ రాజు, ఆర్‌ఎస్సై భానుప్రకాశ్ పాల్గొన్నట్లు తెలిపారు.
సౌందరరాజన్ మృతికి సంతాపం
హన్మకొండ కల్చరల్: చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధానార్చకుడు, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ సౌందరరాజన్ శుక్రవారం వయోభారం, అనారోగ్యంతో మృతిచెందడంతో ఆయన మృతికి తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య పక్షాన గంగు ఉపేంద్రశర్మ, భాస్కరభట్ల రామశర్మ, తనుగుల రత్నకర్, వివిధ దేవాలయాల అర్చకులు సంతాపం తెలిపారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆధ్వర్యంలో సౌందర్యరాజన్ వరంగల్‌లో తెలంగాణ అర్చక సమాఖ్య ఏర్పాటు చేశారని, ధూపదీపనైవేద్య పథకం ఏర్పాటుకు నాంది పలికిన వ్యక్తి అని కొనియాడారు.
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ● ముగిసిన జాతీయ సదస్సు


