కంటిచూపు బాగుంటే ప్రమాదాల నియంత్రణ
రామన్నపేట : డ్రైవర్ల కంటి చూపు బాగుంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలమని వరంగల్ పోలీసు కమీషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ రెండో విడతలో భాగంగా వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ములుగు రోడ్డులోని వెంకటేశ్వర కల్యాణ మండపంలో ఆటో డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక రీజినల్ ఐ ఆస్పత్రి, శరత్ ఐ ఆస్పత్రి, కీర్తి ఆస్పత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి పోలీసు కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరానికి సుమారు 400 మంది ఆటో డ్రైవర్లు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈసందర్భంఆ 300 మంది డ్రైవర్లకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రతీ వాహనాదారుడు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంగా సీఎం అరైవ్ అలైవ్ ప్రారంభినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమని అన్నారు. ప్రజలను తరలించే ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు కంటి చూపుపై మరింత శ్రద్ధ వహించాలని తెలిపారు. ముఖ్యంగా కంటి చూపుతో బాధపడే వారు వాహనం నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం అధికమని తెలిపారు. కంటి చూపు బాగుంటే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలను గుర్తించడం ద్వారా సురక్షితమైన డ్రైవింగ్ చేయగలమని పోలీసు కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు ఏసీపీలు సత్యనారాయణ, నర్సింహారావు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సుజాత, సీతారెడ్డి, వెంకన్న, మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో
ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు
300 మందికి కంటి అద్దాల పంపిణీ


