తల్లులకు తనివితీరా మొక్కులు
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో తిరుగువారం పండుగను సమ్మక్క–సారలమ్మ పూజారులు ఘనంగా నిర్వహించారు. మహాజాతర పూజా కార్యక్రమాల్లో భాగంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయమే స్నానాలు ఆచరించిన పూజారులు.. మేడారంలోని సమ్మక్క గుడిని శుద్ధి చేశారు. అమ్మవార్ల శక్తిపీఠాన్ని పవిత్రమైన మట్టితో పూజారి కొక్కెర కృష్ణయ్య అలికి సిద్ధం చేయగా ఆడపడుచులు ముగ్గులతో అలంకరించారు. సమ్మక్క గుడిగుమ్మం, ఆవరణలో ముగ్గులతో అలంకరించారు. అనంతరం సమ్మక్క పూజారులు సిద్ధబోయిన మునీందర్, కొక్కెర కృష్ణయ్య, సిద్ధబోయిన మహేశ్, నితిన్, బాబురావు, దూపవడ్డె నాగేశ్వర్‌రావు, జలగంవడ్డె మల్లెల సత్యం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క తల్లికి ధూపదీపాలు వెలిగించి యాటను నైవేద్యంగా సమర్పించారు.
సారలమ్మ ఆలయంలో..
కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో ప్రధాన పూజారి కాక సారయ్య, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, భుజంగరావు, కనుకమ్మ, అమృత ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఉదయమే గుడిని శుద్ధి చేసి అమ్మవారి వస్త్రాలు, పూజా సామగ్రిని మరోసారి పవిత్రమైన నీటితో శుద్ధి చేశారు. అమ్మవారి వడెరాల కుండలను పసుపు, కుంకుమతో అలంకరించి ధూపదీపాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు పూజారులు సారలమ్మ గుడిలో సమ్మక్క తల్లికి యాటను నైవేద్యంగా సమర్పించి మరోసారి పూజలు నిర్వహించనున్నారు. పూజా రుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు పాల్గొన్నారు. ఆలయాల వద్ద పూజా రుల కుటుంబీకులతోపాటు స్థానిక ఆదివాసీలు, ఆదివాసీయేతరులు మొక్కులు చెల్లించుకున్నారు.
కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం..
మహాజాతర శనివారంతో ముగిసినా మేడారానికి భక్తుల తాకిడి తగ్గడం లేదు. బుధవారం తిరుగువారం పండుగ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల షవర్ల కింద పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో మేడారం మరో సారి జాతర కళను సంతరించుకుంది. దర్శనాల అ నంతరం భక్తులు అటవీ ప్రాంతాల్లో విడిది చేసి స హపంక్తి భోజనాలు ఆరగించారు. భక్తులు మేడారానికి అధిక సంఖ్యలో తరలిరావడంతో రోడ్ల వెంట వాహనాలు బారులుదీరాయి. ప్రధానంగా జంపన్నవాగు నుంచి ఊరట్టం స్తూపం వరకు వాహనాల రద్దీ నెలకొంది. పోలీసులు వెంటనే వాహనాలను క్లియర్ చేశారు.
మేడారంలో తిరుగువారం పండుగ
మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు
భారీగా తరలివచ్చిన భక్తులు..
తల్లులకు తనివితీరా మొక్కులు
తల్లులకు తనివితీరా మొక్కులు


