నగారా పోరులో ‘నగదు’ ఉపాయం
పరకాల: టికెట్ (బీఫామ్) ఇవ్వాలంటే ఆ నాయకుడి ముందు ఎన్నికల్లో ఖర్చు పెట్టాల్సిన రూ.లక్షలనగదు ప్రత్యక్షంగా చూపించాలి. కానీ, అప్పటికప్పుడు లక్షల్లో డబ్బు కావాలంటే దొరకలేదు. దీంతో ఓ ఇద్దరు ఆశావహులు.. తెల్లపేపర్లను రూ.500 సైజులో కట్ చేశారు. వంద చొప్పున ఉండే కట్టలో పైన, కింద అసలు నగదు..లోపల అన్నీ తెల్లపేపర్లు పెట్టారు. ఇదిగో తమ దగ్గర ఉన్న డబ్బు అంటూ చూపించి టికెట్ ఖరారు చేసుకున్నారు.. సాయంత్రానికి అసలు నగదును ముట్టచెప్పారు. ఈ ఘటన పరకాల మున్సిపాలిటీలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రజల్లో ఆదరణ ఉన్నా.. పార్టీలో కష్టపడి పనిచేసినా నగదు లేకపోతే పనికాదు.. టికెట్ రాదు. ఇవీ పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పెట్టిన షరతులు. కనీసం రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు నగదు చేతిలోఉంటే పోటీలో ఉండాలనే షరతులతో ఆశావహులు పడరాని పాట్లు పడ్డారు. టికెట్ కోసం చాలామంది ఇంటి ఆస్తి పేపర్లు .. బంగారం తాకట్టుపెట్టి వస్తే.. కొందరు బ్యాంక్‌ల నుంచి రూ.లక్షల్లో విత్‌డ్రా చేశారు. జమచేసుకున్న డబ్బు సంచులతో నేతల ముందు వాలాల్సి వచ్చింది. పరకాల మున్సిపాలిటీలో ఓ ఇద్దరు ఆశావహులు మాత్రం ఓ ప్రజాప్రతినిధి ముందు ఓ సంచిలో కింద తెల్లకాగితాలు..పైనా కొంత నగదుతో ప్రత్యక్షమయ్యారు. ఆయన చెప్పిన నగదుతో వచ్చినట్లు స్పష్టం చేయడంతో టికెట్ ఖరారు అయినట్లు సమాచారం. అప్పటివరకు తమ వద్దనే సంచిని ఉంచుకున్న ఆశావహులు ఓ రెండు గంటల తర్వాత కావాల్సినంత నగదు జమ చేసి తమ నేత సూచించిన నాయకుడికి ముట్టజెప్పిట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ ఇద్దరు అభ్యర్థుల తీరు చూసి నాయకులు నివ్వెరపోయినట్లు సమాచారం.
రాజకీయ నేతల ముందు
ఖాళీ డబ్బు సంచులు
అభ్యర్థుల తీరు చూసి నివ్వెరపోయిన నేతలు


