
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 6వేల సీఎస్‌సీలు
నిర్వాహకులకు లాగిన్ అవకాశం కల్పించిన టీజీ ఎన్పీడీసీఎల్
గ్రామాల్లోనే వినియోగదారులు బిల్లులు చెల్లించే సౌకర్యం
విద్యుత్ సిబ్బంది అవసరం లేకుండానే బిల్లులు రాబట్టుకునే దిశగా డిస్కం
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 6 వేల కామన్ సర్వీస్ సెంటర్‌లు
హన్మకొండ: విద్యుత్ బిల్లుల చెల్లింపులు మరింత సులువు కానున్నాయి. ఇప్పటివరకు గ్రామాలకు విద్యుత్ సిబ్బంది వస్తేనే బిల్లులు చెల్లించేవారు. ఇకనుంచి కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ)లోనూ విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశాన్ని టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం కల్పించింది. ఇప్పటికే బిల్లులు చెల్లింపునకు టీజీ ఎన్పీడీసీఎల్ మొబైల్ యాప్ తో పాటు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర యూపీఐ యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే సౌలభ్యం ఉంది. గ్రామీణ ప్రాంత నిరక్షరాస్యులు, స్మార్ట్ ఫోన్ లేని వారు, వృద్ధులు, మహిళలు ఇప్పటికీ విద్యుత్ ఉద్యోగి వస్తేనే బిల్లులు చెల్లిస్తున్నారు. ఇక నుంచి విద్యుత్ ఉద్యోగి కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోని కామన్ సర్వీస్ సెంటర్‌లో చెల్లించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం పౌరులకు సేవలు అందించేందుకు కామన్ సర్వీస్ సెంటర్‌ల రూపంలో ఐసీటీ ఆధారిత నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కేంద్రాలు ఆధార్ నమోదు, బీమా, పాస్‌పోర్ట్, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు వంటి అనేక రకాల సేవలను అందిస్తున్నాయి.
14 రోజుల సమయంలో..
సాధారణంగా గృహ వినియోగదారులు ప్రతీ నెల గ్రామాల్లోకి వచ్చే విద్యుత్ ఉద్యోగికి బిల్లులు చెల్లిస్తున్నారు. రీడింగ్ నమోదు చేసి వినియోగదారుడి చేతికి బిల్లు ఇచ్చిన తర్వాత బిల్లు చెల్లింపు చేయడానికి 14 రోజుల సమయం ఉంటుంది. ఈ 14 రోజుల్లో ఒక్కరోజు మాత్రమే విద్యుత్ ఉద్యోగి బిల్లుల వసూళ్లకు వస్తారు. సీఎస్‌సీల ద్వారా 14 రోజుల్లో ఏ రోజైనా బిల్లులు చెల్లించే సౌలభ్యం వినియోగదారుడికి అందుబాటులోకి రానుంది. సీఎస్‌సీ సెంటర్ నిర్వాహకులకు టీజీ ఎన్పీడీసీఎల్ లాగిన్ సౌకర్యం కల్పిస్తుంది. లాగిన్ ద్వారా వినియోగదారుల నుంచి బిల్లులు స్వీకరిస్తారు. ఈ మేరకు సీఎస్‌సీ సెంటర్ నిర్వాహకులు వినియోగదారుల నుంచి కొంత చార్జీలు వసూలు చేస్తారు.
బిల్లులు చెల్లించేలా అవగాహన..
ఇప్పటికే డిజిటల్ పేమెంట్‌లను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న విద్యుత్ పంపిణీ సంస్థలు ఇప్పుడు కామన్ సర్వీస్ సెంటర్‌లను బిల్లులు స్వీకరించేందుకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా క్రమంగా విద్యుత్ బిల్లుల చెల్లింపును పూర్తిగా వినియోగదారుడిని బాధ్యుడిని చేయనుంది. పైగా సిబ్బంది కొరత తీరనుంది. గ్రామాల్లోకి ఉద్యోగిని పంపించడాన్ని విరమించుకోనుంది. ఈ క్రమంలో గ్రామాల్లోని వినియోగదారులు కామన్ సర్వీస్ సెంటర్‌లో బిల్లులు చెల్లించే విధంగా అవగాహన కల్పించనున్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 17 జిల్లాలు 299 మండలాలున్నాయి. 7,184 గ్రామ పంచాయతీలుండగా దాదాపు ఆరు వేల వరకు కామన్ సర్వీస్ సెంటర్‌లున్నాయి. హెచ్‌టీ సర్వీస్‌లు 5,003, ఎల్‌టీ సర్వీస్ లు 68,62,858 ఉన్నాయి. ఎల్‌టీ సర్వీస్‌ల్లో గృహ వినియోగదారులు 47,41,394, వాణిజ్య వినియోగదారులు 6,01,303, పారిశ్రామిక వినియోగదారులు 33,753, వ్యవసాయ వినియోగదారులు 13,54,099, ఇతరులు 1,32,309 మంది ఉన్నారు.