దొంగ అరెస్ట్‌, రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

దొంగ అరెస్ట్‌, రిమాండ్‌

Aug 26 2025 7:15 AM | Updated on Aug 26 2025 7:15 AM

దొంగ అరెస్ట్‌, రిమాండ్‌

దొంగ అరెస్ట్‌, రిమాండ్‌

ఖిలా వరంగల్‌: దొంగను అరెస్ట్‌ చేసి అతడి వద్ద నుంచి రూ.5.50 లక్షల విలువైన 56.083 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు వరంగల్‌ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ పి. సురేందర్‌ తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన వల్లపు గోపి(29) వరంగల్‌ ప్లాట్‌ ఫామ్‌పై సోమవారం అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో జీఆర్పీ పోలీసులు తనిఖీ చేయగా.. రూ.5.50 లక్షల విలువైన 56.083 గ్రాముల బంగారం లభ్యమైంది. అనంతరం విచారించగా ఇటీవల నెక్కొండ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల వద్ద చోరీ చేసినట్లు ఒప్పకున్నాడు. దీంతో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జీఆర్పీ సిబ్బంది రాము, రియాజోద్దిన్‌, నాగరాజు, ఏఎస్సై రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

నౌవేరా షేక్‌కు రిమాండ్‌

వరంగల్‌ లీగల్‌: హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఎం/ఎస్‌ హారా గోల్డ్‌ ఎగ్జిమ్‌ లిమిటెడ్‌) సీఈఓ నౌవేరా షేక్‌పై ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ కాగా సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేసి జిల్లా ప్రధాన న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. సెప్టెంబర్‌ 8వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ అదేశాలు జారీ చేశారు. హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ సీఈఓ నౌవేరా షేక్‌ వరంగల్‌ చార్‌బౌలి ప్రాంతానికి చెందిన షాహేద్‌ పర్వీజ్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులను ప్రలోభ పెట్టి పెద్ద మొత్తంలో బంగారంపై పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో వడ్డీ, లాభాలు అందిస్తామని తెలపడంతో ముగ్గురు బాధితులు రూ.33 లక్షలు చెల్లించారు. పెట్టుబడి అనంతరం వారికి సుమారు రూ.32వేలు మాత్రమే కంపెనీనుంచి రాగా విచారణలో మోసపోయామని నిర్ధారించుకొని 2021, జనవరి 14న బాధితుడు షాహేద్‌ పర్వీజ్‌ చేసిన ఫిర్యాదు మేరకు ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 2021లో నౌవేరా షేక్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ప్రతీ ఆదివారం సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని, అలాగే ప్రతీ కోర్టు వాయిదాకు హాజరుకావాలని న్యాయమూర్తి షరతులు విధించారు. పలు వాయిదాలకు నిందితురాలు నౌవేరా షేక్‌ హాజరు కాకపోవడంతో జిల్లా కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ వారెంట్‌ మేరకు ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు నిందితురాలిని సోమవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చగా సెప్టెంబర్‌ 8 తేదీ (14 రోజుల) వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఆదేశించారు.

సైబర్‌ నేరస్తుడి అరెస్ట్‌

వరంగల్‌ క్రైం : బెయిల్‌ కండీషన్లను ఉల్లంఘించిన సైబర్‌ నేరస్తుడిని అరెస్ట్‌ చేసినట్లు సైబర్‌ క్రైం ఏసీపీ గిరికుమార్‌ తెలిపారు. ఈ ఏడాది మార్చిలో తిరుమల హ్యాచరీస్‌లో పనిచేసే మేకల శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి నమ్మించి ఓం సాయి ట్రేడర్స్‌ అకౌంట్‌కు రూ. 1.68 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని మోసం చేశాడు. ఈ ఘటనపై బాధితుడు శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కాగా ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన సంజిత్‌ కుమార్‌సింగ్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపించినట్లు తెలిపారు. నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చి క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ప్రతీ ఆదివారం హాజరుకావాల్సి ఉండగా రాలేదన్నారు. దీంతో మెమో సమర్పించగా నిందితుడి అరెస్ట్‌కు కోర్టు ఆదేశించిందన్నారు. ఆదివారం నిందితుడిని అరెస్ట్‌ చేసి పరకాల జైలుకు తరలించినట్లు క్రైమ్‌ డీసీపీ పేర్కొన్నారు. కాగా, నిందితుడిని సకాలంలో అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో తెలంగాణ సీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌.. ఏసీపీ గిరికుమార్‌ను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement