
హర్‌ఘర్ తిరంగా వేడుకలు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పురావస్తుశాఖ అధికారులు శనివారం హర్‌ఘర్ తిరంగా సెల్ఫీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో రామప్పకు వచ్చే పర్యాటకులు, భక్తులు, విద్యార్థులు హర్‌ఘర్ తిరంగా నినాదంతో ఉన్న ఫ్లెక్సీలో నిలబడి సెల్పీలు తీసుకున్నారు. ఈ నెల 15న హర్ ఘర్ తిరంగా వేడుకలను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించనుంది.
స్పోకెన్ ఇంగ్లిష్, స్కిల్స్‌లో
శిక్షణ తరగతులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (సెల్ట్) ఆధ్వర్యంలో 40 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.మేఘనరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లను ఈనెల 30వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని ఆ యూనివర్సిటీ విద్యార్థులకు రూ.200, నాన్ టీచింగ్ ఉద్యోగులకు, మహిళలకు ఇతరులకు రూ.1,500లు ఫీజు చెల్లించి ఈనెల 30 వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు మేఘనరావు తెలిపారు.
ఉర్సు విజయవంతానికి
సమన్వయం అవసరం
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
కాజీపేట: అఫ్జల్ బియాబానీ దర్గా ఉర్సును విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆదేశించారు. కాజీపేట మండలం దర్గా కాజీపేట అప్జల్ బియాబానీ దర్గాలో అధికారులతో శనివారం రాత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో జరగనున్న దర్గా ఉత్సవాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా, మాజీ కార్పొరేటర్ ఎండీ.అబుబక్కర్, ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి, వెంకన్నతో పాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
రైతుబీమాకు వివరాలివ్వాలి
న్యూశాయంపేట: జిల్లా పరిధిలోని రైతులందరు రైతుబీమా చేయించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వం రైతులకు రూ.5 లక్షల బీమా చేయిస్తుందని తెలిపారు. 18–59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, పట్టాదారు పాసుబుక్ ఉన్న రైతులు అర్హులన్నారు. గత సంవత్సరం బీమా చేయించుకున్న రైతులు నామిని పేరు, ఇతర సవరణలు చేసుకోవడానికి మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీలోగా పట్టాదారు పాస్‌బుక్, ఆధార్, నామినీ వివరాల జిరాక్స్ ప్రతుల వివరాలు సంబంధిత వ్యవసాయాధికారికి సమర్పించాలని ఆమె సూచించారు.
శ్వేతార్క ఆలయంలో
రాఖీ వేడుకలు
కాజీపేట: కాజీపేట స్వయంభు శ్వేతార్క మూలగణపతి దివ్యక్షేత్రంలో రక్షా బంధన్ వేడుకలతో పాటు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత వేడుకలను శనివారం నిర్వహించారు. ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకుడు అయినవోలు రాధాకృష్ణ శర్మ, సాయికృష్ణ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలోని సంతోషిమాతతో పాటు 29 దేవతామూర్తులకు అభిషేకాలు, అర్చనలు జరిపించారు. అనంతరం ఆలయంలో భక్తులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. ఆలయ కార్యకర్తలకు మహిళా భక్తులు రాఖీలు కట్టి తమ సోదరి భావాన్ని చాటుకున్నారు. అన్నపూర్ణ కేంద్రంలో భక్తులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్వర్లు శర్మ తీర్థప్రసాదాలు అందజేశారు.

హర్‌ఘర్ తిరంగా వేడుకలు

హర్‌ఘర్ తిరంగా వేడుకలు